నాకు మంత్రి పదవి కావాలి
AICC State Affairs In-charge Meenakshi Natarajan: ఇద్దరిదీ ఒక్కటే ఆలోచన… ఇద్దరిదీ ఒకటే లక్ష్యం.. అదీ మంత్రి పదవి.. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్‌కు ఇద్దరూ తమకు మంత్రి కావాలని అడిగారు. అందులో ఒకరు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాగా.. మరొకరు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు. తమకు మంత్రి పదవి కావాలని ఇద్దరూ ఆమె దృష్టికి తీసుకురావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది..
హైదరాబాద్ హైదర్‌గూడ క్యాంపు కార్యాలయంలో మీనాక్షి నటరాజన్ ఆదిలాబాద్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో పదవులు… పార్టీ స్థితిగతులపై ఆరా తీశారు. ఒక్కో నేతకు 10 నిమిషాల సమయం ఇచ్చి వివరాలు సేకరించారు ఆమె. ఈ సందర్భంగా పలువురు నేతలు జిల్లాలో ముఖ్యంగా తమ నియోజకవర్గంలో పార్టీపరంగా ఉన్న సమస్యలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువచ్చారు. తనకు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కావాలని ఆదిలాబాద్ ఇంచార్జి కంది శ్రీనివాస్ అడిగినట్లు సమాచారం.
ఇక మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే తాను పార్టీ కోసం కష్టపడ్డానని కేబినెట్ లో చోటు కల్పించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. ఆ తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌తో సైతం ఆమె మాట్లాడారు. ఆయన కూడా తన మనసులో మాటగా మంత్రి పదవి కావాలని కోరినట్లు సమాచారం. . మొదట ప్రేమ్ సాగర్ రావు తో… ఆ తర్వాత వివేక్ తో భేటి అయిన మీనాక్షి అన్ని విషయాలు తెలుసుకున్నారు. కేబినెట్ లో బెర్తులపై ఇద్దరి విన్నపం నేపథ్యంలో ఆమె ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఆసక్తిగా మారింది.