కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు నడుస్తున్నయ్..
కాంగ్రెస్ పార్టీలో కులరాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనలో మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. కాంగ్రెస్ లో కుల రాజకీయాలు నడుస్తున్నాయని, నిమ్న వర్గ నేతలను సీఎం రేవంత్ రెడ్డి తక్కువగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి పుష్కరాల్లో ఎంపి వంశీని కులం పేరిట అవమానించారని, ఆయనను పుష్కరాలకు ఆహ్వానించలేదన్నారు. యాదగిరి గుట్టలోనూ ఉప ముఖ్యమంత్రి భట్టిని కింద కూర్చోపెట్టి సీఎం రేవంత్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా బీజేపీ మానవత్వం లేకుండా వ్యవహరించిందన్నారు. కనీసం మృతదేహాలను కూడా మావోయిస్టుల కుటుంబాలకు అప్పగించలేదన్నారు. బీజేపీ ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నంబాల కేశవరావు మృతి చెందితే కనీసం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీస్ బలగాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నాకు సొంత ఎజెండా ఏమీ లేదన్నారు. పార్టీని కాపాడుకోవాలనేదే నా తపన అని మరోమారు స్పష్టం చేశారు.
బీజేపీలో పార్టీ విలీనం చేయొద్దని నా వాదన అని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతామని చెప్పారని, అస్సలే విలీనం ఒప్పుకోనని వెల్లడించారు. లేఖ రాయడంలో నా తప్పేం లేదని చెప్పారు. నేను కలవాలని, చెప్పాలని ప్రయత్నం చేశాను. తండ్రిని కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేక పోయానని ఆమె అన్నారు. లేఖ బయటికి తెచ్చిన వారిని పట్టుకోండని ఆమె కోరారు.