కరువుతీరా వానలు
Rains: ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలే పడలేదు. గత ఏడాదితో పోల్చితే ఈ సీజన్లో చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. రాష్ట్రంలో పునాస సాగు మొదలై నెల రోజులు అవుతున్నా వానలు సరిగ్గా పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ నుంచే ప్రారంభం కావాల్సిన వానాకాలం సీజన్ వర్షాలు కురవకపోవడంతో నెల రోజులు ఆలస్యమైంది. ఇప్పటి వరకు టైమ్ కు వానల్లేకపోవడంతో సాగు పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
సీజన్ మొదలైందని కొందరు రైతులు పోయిన నెల మొదట్లో పడ్డ కొద్దిపాటి వర్షాలకు విత్తనాలు వేశారు. అయితే, గింజలు సరిగ్గా మొలవక, మొలిచినవి ఎండిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల రైతులు పత్తి విత్తనాలు రెండు సార్లు పెట్టుకోవాల్సిన దుస్థితి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు పత్తి సాగు చేస్తున్న రైతులు తమ మొక్కల కోసం బాధపడ్డారు. కానీ, ఈ వర్షాలతో తమ సాగుకు డోకా లేదని చెబుతున్నారు. అదే సమయంలో వరిసాగు కోసం రైతులు సన్నాహాలు చేస్తున్నారు.
మూడు రోజులుగా ముసురుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ మండలంతో పలు మండలాల్లో రాత్రీ నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. కొమురం భీమ్ ప్రాజెక్ట్ డ్యామ్ గేట్లు ఎప్పుడైనా తెరిచే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. బెజ్జూర్ మండలం సోమిని, మెగవెల్లి, తలాయిలో ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా పంటలు నీట మునిగాయి. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లను దాటి పల్లెప్రకృతి వనం వరకు నదీ నీరు చేరింది. తలాయి, పాపన్ పేట్ మధ్య రెండు ఒర్రెలపై వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాంకిడి మండలంలో దుబ్బగూడపరిధిలోని లో లేవల్ వంతెన పై నుండి వరద నీరు పొంగిపొర్లుతోంది. చింతలమానేపల్లి మండలం ప్రాణహిత బ్యాక్ వాటర్ తో దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
మంచిర్యాల జిల్లాలో సైతం రాత్రి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రాణహిత, గోదావరి,నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పుణ్య స్నానాలకు వెళ్లే ప్రజలకు, చేపల వేటకు వెళ్లే మచ్చ కారులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదయ్యింది. జులై 1 నుంచి బుధవారం రాత్రి వరకు ఆయా జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవి.. ఆదిలాబాద్ జిల్లాలో 16 శాతం, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 8 శాతం అధికంగా నమోదు అయ్యింది. ఇక మంచిర్యాల జిల్లాలో 40 శాతం, నిర్మల్ జిల్లాలో 12 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం.