తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(teenamar mallanna ) కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ పరిధి మేడిపల్లిలో ఉన్న ఆఫీసుపై తెలంగాణ జాగృతి కండువాలు వేసుకున్న కొందరు దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో మల్లన్న కార్యాలయంలోనే ఉండగా.. ఆయన గన్‌మెన్లు రక్షణగా నిలిచారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పలువురికి గాయాలయ్యాయి. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారితీసింది.
ఎంఎల్‌సీ కవిత అనుచరులే తనపై దాడికి పాల్పడ్డారని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. కవితతో కలిసి తిరిగిన వారు తమపై దాడి చేశారని మల్లన్న ఆరోపణలు చేశారు. హత్యాయత్నం ఆపేందుకు తన గన్ మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారని మల్లన్న వివరణ ఇచ్చారు. ఆఫీస్‌పై దాడి జరగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా,. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని తప్పుపడుతూ మల్లన్న వ్యాఖ్యలు చేయడంతోనే ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా మల్లన్న కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో దాడి జరిగినట్లు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపిస్తున్నారు. అయితే.. జాగృతి నేతల దాడి సమయంలో మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు.