మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు
Maoists surrendered:మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. మంగళవారం ఆయన ఎదుట సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు నేతలు లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న @ గోపన్న, ఆయన భార్య చౌదరి అంకుభాయి(డీసీఎం) సీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో మావోయిజం కాలం చెల్లిన సిద్ధాంతంగా మిగిలిపోయిందన్నారు. హింసను ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారని, ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ మావోయిజం కనుమరుగైపోయిందని స్పష్టం చేశారు. మావోయిస్టులకు నేటి యువత దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. ప్రస్తుత సమాజంలో యువత చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వారు దూరంగా ఉంటున్నారని సీపీ చెప్పారు. మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయిందని. చదువుకున్న వారు ఎవరు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం లేదని స్పష్టం చేశారు.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను జన జీవన స్రవంతి లోకి రావాలిసినది గా కోరుతున్నామని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలని కోరుతున్నామన్నారు. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వస్తే, తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందన్నారు. కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందన్నారు. వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.