కొప్పుల ఈశ్వ‌ర్ చేతికి టీబీజీకేఎస్ ప‌గ్గాలు

TBGKS: సింగ‌రేణిలో బీఆర్ఎస్ (BRS Party) అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం(TBGKS) బాధ్య‌త‌ల‌ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి అప్ప‌గించారు. ఈ మేర‌కు బుధ‌వారం తెలంగాణ భవ‌న్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అదే విధంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకుపోవాలని, సింగరేణి సమస్యలపై మరింత పెద్దఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో చ‌ర్చించారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి సంస్థ కోసం చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకుపోవాలని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ సూచించారు. పది సంవత్సరాల కాలంలో సింగరేణితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ పనిచేశారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలను తీవ్రంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అడ్డగోలుగా అమలు చేయడానికి వీలుకాని హామీలు ఇచ్చిన తీరుగానే సింగరేణికి కూడా మోసం చేసిందని, ఈ అంశాలను కార్మికుల దృష్టికి తీసుకుపోవాలని ఆయ‌న టీబీజీకేఎస్ నేత‌ల‌కు సూచించారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణ కోసం బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు సహకారం అందిస్తుందని. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని స్ప‌ష్టం చేశారు.

కార్మికుల కోసం పార్టీ లీగల్ సెల్ కూడా పూర్తిస్థాయి అండగా ఉంటుందని, ఏ కార్మికునికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినా.. చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ సెల్ సహకారం అందిస్తుందని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. త్వరలోనే సింగరేణి ప్రాంతంలో బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like