విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉంది
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో విద్యనభ్యసిస్తున్న బి.తరుణి (8వ తరగతి) జ్వరంతో, బి. రేవతి (6వ తరగతి) టాన్సిలైటిస్ తో కూడిన జ్వరంతో బాధపడుతున్నారని అన్నారు. మాతా, శిశు ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినిలు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు . మీడియా ప్రతినిధులు సందర్శించినప్పుడు వైద్యులు ఈ విషయాన్ని నిర్ధారించారని, చికిత్స కొనసాగుతుందన్నారు. ఎ.టి.డి.ఓ., పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి వెంట ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై కొంత మంది కలుషిత ఆహారం తినడం వల్ల ఇలా జరిగిందని అవాస్తవాలు ప్రచారం చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి అవాస్తవ, అనాలోచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.