ఖ‌రీదైన బాటిళ్ల‌లో క‌ల్తీ మందు

Adulterated liquor: నలుగురు స్నేహితులు కలిసి దావత్‌ చేసుకుందామని రూ.వేలు పోసి మ‌ద్యం బాటిల్‌ కొన్నారు. సీల్‌ ఓపెన్‌ చేసి, మూత విప్పి ఒక పెగ్గు పోసుకొన్నారు. ఒక్క బుక్క తాగగానే చీప్‌ లిక్కర్‌ మాదిరిగా వాసన, ఘాటు రావడంతో అవాక్కయ్యారు. ఎంతో మంది మందుబాబులకు ఎదురవుతున్న అనుభవం ఇది.

ఖరీదైన స్కాచ్‌ బాటిళ్లతోపాటు, రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన మద్యంలో కల్తీ జరుగుతున్నట్టు మందుబాబులు ఆరోపిస్తున్నారు. విదేశీ మద్యం బ్రాండ్లలో ఈ తరహా కల్తీ ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అనుమానం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప నిఘా కొరవ‌డ‌టంతో మ‌ద్యం క‌ల్తీ య‌థేచ్ఛ‌గా సాగుతోంది. ఖ‌రీదైన బాటిల్‌ సీల్‌ వేసినట్టే ఉంటున్నదని, లోపల మందు మాత్రం చీప్‌ లిక్కర్‌ వాసన వస్తున్నదని, ఒకటి రెండు పెగ్గులకే రప్పున తలకెక్కుతున్నదని ఎంతో మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదంతా కల్తీ మద్యం మహిమ అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం ఎడాపెడా బెల్టు దుకాణాలను ప్రోత్సహించి, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేయిస్తుండటంతో లిక్కర్‌ సిండికేట్‌ చేతివాటం మొదలు పెట్టింది.

మ‌ద్యం క‌ల్తీ చేస్తారిలా…
ఖరీదైన స్కాచ్‌ బాటిళ్లతోపాటు, కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన మద్యంలో కల్తీ జరుగుతున్నట్టు మందుబాబులు ఆరోపిస్తున్నారు. విదేశీ మద్యం బ్రాండ్లలో ఈ తరహా కల్తీ ఎక్కువగా జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్కాచ్‌ బాటిళ్లలో స్కాచ్‌ తీసేసి చీప్‌ లికర్‌, మీడియం లిక్కర్‌తో నింపుతున్నారని ఎక్సైజ్‌ శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రీమియం బ్రాండ్లకు చెందిన మద్యం సీసాల్లో స్పిరిట్‌, చీప్‌ లిక్కర్‌తో నింపి విక్రయిస్తున్నట్టు మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి నకిలీ మద్యాన్ని నిరోధించడానికి ఎక్సైజ్‌ శాఖ హెడ్‌సీవ్‌ లేబుల్స్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. క్యూర్‌ కోడ్‌, బార్‌ కోడ్‌ ఉండే లేబుల్స్‌ను మద్యం బాటిల్‌ మూతల మీద అతికిస్తున్నారు. దీన్ని సులభంగా డీకోడ్‌ చేసి, ఆ మద్యం సీసా అసలుదా? నకిలీదా? అని గుర్తించవచ్చు. అయితే మద్యం సిండికేట్‌ నేర్పుగా సీల్‌ వేసి ఉన్న బాటిళ్లలోనే కల్తీ చేస్తున్నట్టు ఎక్సైజ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ మోసాలు బెల్టు దుకాణాలు, బార్లలో ఎక్కువ జరుగుతున్నట్టు పేర్కొంటున్నారు.

రూ. 500 ఖ‌ర్చు… రూ. 4,370 లాభం..
కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ వ్యవహారం నడిపిస్తున్నారు. మూడు ఇంచుల పరిమాణంలో ఉండే కనెక్టర్‌ (స్రూ డ్రైవర్‌ వంటిది) అనే చిన్న పరికరంతో సీసా మూతను తీస్తారు. హెడ్‌ సీవ్‌ లేబుల్ ఏ మాత్రం చిరిగిపోకుండా నేర్పుగా ఈ మూతలు తీస్తారు. ఒకో బాటిల్‌ నుంచి మద్యం తీసి, దాని స్థానంలో నీరు, స్పిరిట్‌, చీప్‌ లిక్కర్‌, మీడియం లిక్కర్‌.. ఇలా సీసా బ్రాండును బట్టి ఏది సరిగా కలిసిపోతుందో దానిని కలుపుతారు. ఆ తర్వాత తిరిగి యథాతథంగా మూతను బిగిస్తున్నారు. క్వార్టర్‌ బాటిల్‌లో 180 మిల్లీలీటర్ల మద్యం ఉంటుంది. ఇందులోంచి 60 ఎంఎల్‌ మద్యం తీసేసి, అంతే మొత్తంలో స్పిరిట్‌ కలుపుతారు. లీటర్‌ స్పిరిట్ రూ.500 ఉన్నది. లీటర్‌ స్పిరిట్‌లో రెండు లీటర్ల నీళ్లు కలుపుతారు. ఈ లెక్కన రూ.500 ఖర్చుతో 19 క్వార్టర్ల లిక్కర్‌ను కల్తీ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా రూ. 4370 వ్యాపారం జరుగుతుందన్నమాట. బహిరంగ మార్కెట్‌లో స్పిరిట్‌పై నిషేధం ఉండడంతో పరిశ్రమల నుంచి సేకరిస్తున్నట్టు సమాచారం.

సూర్య‌పేట జిల్లాలో బ‌య‌ట‌ప‌డిన బండారం..
సూర్యపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారీ గోదాంపై తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఒరిజినల్‌ ఖాళీ బాటిల్స్‌ను సేకరించి, అందులో సగం నీళ్లు, కొంత స్పిరిట్‌, కొంత మద్యం కలిపి.. సీల్‌ వేసి కిక్‌కు చెక్‌ పెట్టిన మద్యం మాఫియా అరాచకం తెలిసింది. ఈ కల్తీ ఒకటి రెండు బ్రాండ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఏకంగా 178 బ్రాండ్లనే కల్తీ చేశారు. ఇక్క‌డ సుమారు 15 లక్షల రూపాయల విలువైన కల్తీ విస్కీ, సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన స్పిరిట్ , నకిలీ మద్యం నింపి మార్కెట్‌లోకి పంపడానికి సిద్ధంగా ఉన్న 11 వేల ఖాళీ బాటిళ్లు, వాటికి అతికించాల్సిన 20 లేబుల్ బండిల్స్ కూడా పట్టుబడ్డాయి.

స్పిరిట్ కంపెనీ నుంచి అక్ర‌మ కొనుగోళ్లు..
ఈ ముఠా హైదరాబాద్‌లోని కృష్ణపద్మ అనే స్పిరిట్ కంపెనీ నుంచి టన్నుల కొద్దీ స్పిరిట్ కొనుగోలు చేసి, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని ఒక రైస్‌మిల్లులో రహస్యంగా కల్తీ సరుకు తయారు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యాన్ని మార్కెట్‌లోకి పంపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం, రేపల్లె, అమలాపురం వంటి పలు కీలక ప్రాంతాల్లోనూ ఈ ముఠా నకిలీ మద్యాన్ని విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో కౌంటర్ విధులు నిర్వహిస్తున్న శంకర్‌తో పాటు మరికొందరు ఈ ముఠాలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like