దేవాపూర్ సిమెంట్ ఎన్నికలపై తీర్పు వాయిదా
Devapur Orient Cement: దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఎన్నికలపై హై కోర్టు తీర్పు మళ్లీ వాయిదా పడింది. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వరమ్మ సెలవుపై ఉన్నారని అధికారులు కోర్టు కు వెల్లడించారు. DCL సెలవు కారణంగా చూపుతూ ఎన్నికలపై కార్మిక శాఖ కాలయాపన చేస్తోందని జడ్డి దృష్టికి తీసుకువచ్చారు కార్మిక సంఘం నేతలు.. దీంతో అధికారుల ధోరణిని మందలించిన జడ్జి కోర్టు తీర్పు ఎల్లుండికి (గురువారం) వాయిదా వేశారు.
ఈ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై ఎన్నో రోజులుగా ఉత్కంఠ నెలకొంటోంది. అర్హత సాధించిన అయిదు గుర్తింపు సంఘాలకు జులై 11న ఆదిలాబాద్ లో కార్మిక శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు గుర్తులను కేటాయించారు. అదే రోజు ఎన్నికల ప్రకటన వస్తుందని కార్మికులు భావించారు. అయితే సమావేశం 18వ తేదీకి వాయిదా పడింది. గుర్తుల కేటాయింపు రోజు నుంచే ఎన్నికల నియమాలు అమల్లోకి వస్తున్నాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వరమ్మ సెలవుపై వెళ్లడంతో ఈ సమావేశం వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే రెండేళ్ల కిందటే నిర్వహించాల్సిన ఎన్నికలు అధికారులు కావాలనే వాయిదా వేస్తున్నారని కార్మిక సంఘం నేతలు కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సెలవు విషయాన్నే ప్రస్తావించడం పట్ల కార్మిక సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరి కోసం ఎన్నికలు వాయిదా వేస్తున్నారని ఇది సరికాదని చెబుతున్నారు. కార్మికుల కోరిక మేరకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.