అభివృద్ధి పేరిట గుట్టలు మాయం
మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు
Nadipally Diwakar Rao:దండేపల్లి మండలం రెబ్బెనపల్లి, నెల్కీ వెంకటాపూర్లో అధికార పార్టీ నాయకులు కొండలు మాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. దండేపల్లి మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 9లో గుట్టలను అక్రమంగా తవ్వుతున్నారని దుయ్యబట్టారు. నెల్కీ వెంకటాపూర్ అందుగుల పేట శివారు నెంబర్ 521&444లో ఎలాంటి అనుమతి లేకుండా కోట్ల విలువచేసే మట్టి అక్రమంగా తవ్వుతూ సొంత జేబులకు నింపుకుంటున్నారనీ అన్నారు. ఎక్కడైనా మట్టి తీయాలంటే దాని టెండర్ పిలిస్తే కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉందన్నారు.
అలా కాకుండా కేవలం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి అక్రమంగా మట్టి తీసి అమ్ముకుంటున్నారనీ అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు టిప్పర్ల మీద టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయనీ, ఒక్కొక్క టిప్పర్ 5000 రూపాయలతో వేలాది టిప్పర్ల మట్టి అమ్ముకుంటున్నారనీ ఆరోపించారూ. ఇన్ని జరుగుతున్నా, అక్కడున్న అధికారులు, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.
తక్షణమే మైనింగ్, రెవెన్యూ, పోలీసులు కాంగ్రెస్ నాయకుల మీద చర్య తీసుకోకపోతే ప్రభుత్వానికి రావలసిన డబ్బును అక్రమార్కులతో కట్టియ్యకపోతే తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమానికి పాల్పడ్డ వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. చూసి చూడనట్టు వదిలిపెట్టిన అధికారులను కచ్చితంగా సస్పెండ్ చేయించి తీరుతామన్నారు.