ఆ జ‌ర్న‌లిస్టుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

పాత్రికేయులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాస్తవాలను తెలపాల‌ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్ర‌జాస్వామ్యంలో పాత్రికేయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపట్టే పథకాలు, కార్యక్రమాలను విస్తృత ప్రచారం చేసి ప్రజలందరికి వాటి గురించి తెలిసేలా చేయాల‌న్నారు. ఆ పథకాల ఫలాలు పొందే విధంగా చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ అన్యాయాలు, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి వాటిని పరిష్కరించడంలో పాత్రికేయులు తమ వంతు బాధ్యత నిర్వహిస్తారని తెలిపారు.

మీడియా ద్వారా ప్రపంచానికి తెలియని ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయని, ఎంతో మంది బాధితులకు అవసరమైన సాయం, న్యాయం అందాయన్నారు. జిల్లాలో కొంతమంది పాత్రికేయులు అవాస్తవ వార్త కథనాలను ప్రచురిస్తూ వ్యాపార, వాణిజ్య సంస్థలలో, ప్రభుత్వ కార్యాలయాలలో, వ్యక్తిగత బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింద‌న్నారు. పాత్రికేయులు తాము ప్రచురించే విషయాలపై పూర్తి నిజనిర్ధారణ చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో కొంతమంది నకిలీ జర్నలిస్టుల కారణంగా అసలైన జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచురిస్తూ, బెదిరింపులకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like