మంత్రి వివేక్ పీఏపై పోలీసుల‌కు ఫిర్యాదు

Police complaint filed against Minister Vivek PA:మంత్రి వివేక్ పీఏ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఈ మేర‌కు బీఆర్ఎస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీ డాక్ట‌ర్ రాజా ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా రాజా ర‌మేష్ మాట్లాడుతూ మంత్రి వివేక్ అగ్రకులాలకు కొమ్ము కాస్తూ తన పీఏలతో దళితులపై కక్షపూరితంగా అసత్యపు ప్రచారాలు చేయిస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. చెన్నూర్ నియోజకవర్గంలో దళిత నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ, మంత్రి వివేక్ పీఏ రమణారావుపై వెంటనే కేసు నమోదు చెయ్యాలని డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు.

దళిత సంఘాలను ఎర‌వేసి మంత్రి పదవి సంపాదించుకున్న మంత్రి వివేక్ దళితులపై అగ్రకులాల వారితో ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయించడం యావత్ దళిత సమాజానికే సిగ్గుచేట‌న్నారు. గతంలో కేవ‌లం పేపర్ క‌ట్టింగ్‌లు సోష‌ల్ మీడియాలో పెట్టినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో చూస్తామని మంత్రి అధికారానికి తలొగ్గి తగిన న్యాయం చేయ‌క‌పోతే పోతే రామగుండం క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేసి పెద్ద ఎత్తున్న నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

దళితులపై జ‌రుగుతున్న దాడులను ఆపాల్సిన స్థానంలో ఉన్న‌ మంత్రి వివేక్ అగ్రకులాలకు కొమ్ముకాస్తూ దళితులపై కక్షపూరితంగా అసత్యపు ప్రచారాలు చేయించడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే తగిన బుద్ధి చెబుతామన్నారు. మంత్రి వివేక్ కి చేతనైతే బాల్క సుమన్ కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తాను సొంతంగా ఇచ్చిన మేనిఫెస్టో అమలు అయ్యేటట్టు చూడాల‌న్నారు. మీడియా చేతిలో ఉందని దళితులపై అసత్యపు ప్రచారాలు చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డాక్టర్ రాజారమేష్ హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like