ఎన్నిక చిన్నది.. వ్యూహం పెద్దది..
-దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికలు రెండు వర్గాలకు ప్రతిష్టాత్మకమే
-మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మారిన ఎన్నిక
-బరిలో దిగిన వివేక్, ప్రేంసాగర్ రావు వర్గాలు
-ఎలాగైనా గెలిపించుకోవాలని పంతం
Devapur Cement Factory Elections:అది కేవలం ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎన్నిక.. కార్మిక సంఘాల మధ్య పోరు.. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో దాని వెనక మాత్రం వ్యూహాలు పెద్దగా మారుతున్నాయి. ఆ పరిశ్రమ ఎన్నిక మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న చందంగా మారిపోయాయి. అది కూడా కాంగ్రెస్ పార్టీకే చెందిన నేతల మధ్య సాగనుండటం గమనార్హం.
కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దాదాపు రెండేళ్లుగా ఇదిగో ఎన్నికలు.. అదిగో ఎన్నికలు అంటూ ఊరిస్తూ వస్తున్న కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణలో జాప్యం చేసింది. తాజాగా పదిహేను రోజుల్లో ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికలకు సమామయత్తం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే గుర్తులు కేటాయించిన నేపథ్యంలో కార్మిక సంఘ నేతలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నారు.
మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..
ఈ ఎన్నికలు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న చందంగా మారాయి. ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీనే. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు, మంత్రి వివేక్, ఆయన అన్న వినోద్, వెడ్మబొజ్జుల మధ్య ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ రెండు వర్గాలు ఎన్నికల్లో గెలిచేందుకు పావులు కదుపుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సోదరుడు సత్యపాల్ రావు ఎన్నో నెలలుగా ఇక్కడ కార్మికులతో ఉంటూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే, ఆయనకు వ్యతిరేకంగా మరో అభ్యర్థిని నిలబెడుతూ మంత్రి వివేక్, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో విక్రమ్ రావును ఆదివాసీ కార్మిక సంఘం తరఫున బరిలో దింపుతున్నట్లు ప్రకటించడం రాజకీయ దుమారం రేపింది. ఇప్పటికే అదే పార్టీకి చెందిన సడెన్‌గా ముగ్గురు ఎమ్మెల్యేలు విక్రమ్‌రావును తెరపైకి తేవడం ప్రేంసాగర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టం అవుతోంది.
గెలుపు కోసం పోటాపోటీ…
దీంతో దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో ఎలాగైలా గెలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, మంత్రి వివేక్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, మంత్రి వివేక్, ఆయన అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు స్థానికులు, కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి అది కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసి ఎన్నికలు అయితన తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చిన విక్రమ్ రావును అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తమతో ఉన్న సతీష్ రెడ్డి అనే కార్మిక సంఘం నేతను దూరం పెట్టడం కూడా వివేక్ వర్గానికి మైనస్ అవుతుందని చెబుతున్నారు. సతీష్‌రెడ్డి వివేక్ ఏ పార్టీలో చేరితో వారితో పాటే ఉన్నారు. కనీసం ఆయనను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడంతో అలిగిన సతీష్‌రెడ్డి ప్రేంసాగర్ రావు వర్గంలో చేరిపోయారు. ఆయన గత కార్మిక సంఘ ఎన్నికల్లో పోటీ చేశారు. స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనకు ఇక్కడ కార్మికుల్లో మంచి పట్టుంది. దీంతో వివేక్ వర్గం ఆయనను దూరం చేసుకుని తప్పు చేసిందనే వాదన వినిపిస్తోంది.
ఇద్దరికీ ప్రతిష్టాత్మకమే… ఎందుకంటే..?
ఈ ఎన్నికలు రెండు వర్గాలకు చాలా చలా ప్రతిష్టాకంగా మారాయి. ఈ గెలుపుతో ప్రేంసాగర్ రావును దెబ్బ తీసి ఆయన ఉనికి కేవలం మంచిర్యాల వరకే పరిమితం చేయాలని మంత్రి వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు భావిస్తున్నారు. అదే సమయంలో తాను ఎన్నాళ్లుగానో పార్టీని నిర్మించి పదేండ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ వస్తే తనకు రావాల్సిన మంత్రి పదవి వివేక్ తన్నుకుపోయారని ప్రేంసాగర్ రావు కోపంతో ఉన్నారు. ఇక్కడ వారి వర్గం ఓడగొట్టి ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. ప్రేంసాగర్ రావుది స్థానిక ప్రాంతం కావడం, ఆయన తండ్రి కూడా ఇక్కడ అధ్యక్షుడిగా చేయడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అదే సమయంలో సత్యపాల్ రావు చాలా రోజులుగా ఉండి ఇక్కడ కార్మికులతో ఉంటున్నారు. అది ప్లస్ అవుతుంది. అయితే, వీరిని ఓడగొట్టాలని మంత్రి వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఏది ఏమైనా ఒక చిన్న సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన కార్మిక సంఘం ఎన్నికలు అటు మంత్రి, ఇటు ఎమ్మెల్యేకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మరి చూడాలి.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు…? ఎవరు ఓడిపోతారు..? ఎవరు తమ పట్టు నిలుపుకుంటారనేది… అయితే, ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తందనే మాత్రం కొసమెరుపు…