రైతుల కోసం రాజీ ప‌డం

PM Modi:”రైతుల హక్కుల విషయంలో ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేద”ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతుల ప్రయోజనాల కోసం నేను వ్యక్తిగతంగా ఎంతైనా చెల్లించేందుకు సిద్ధమ‌న్నారు. రైతుల సంక్షేమమే మా ప్రథమ లక్ష్యం. రైతులు, మత్స్యకారులు, పాడిపరిశ్రమలపై మేమెప్పుడూ రాజీపడం. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే దేశానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని మాకు తెలుసు. అయినా, రైతుల ప్రయోజనాల కోసం నేను వ్యక్తిగతంగా ఎంతైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా. భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు.

భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంద‌న్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పు చేసిన పంటలు (Genetically Modified Crops) వంటి వివిధ వస్తువులపై సుంకాల రాయితీలు ఇవ్వాలని భారత్‌ను డిమాండ్ చేసింది. భారత్ దానిని అంగీక‌రించ‌లేదు. అమెరికా వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను ఈ దేశంలోకి అనుమ‌తిస్తే కోట్లాది మంది రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంది. వ్యవసాయం కార్పొరేట్ సంస్థల వ్యాపారంలా కాకుండా కోట్లాది మంది చిన్న రైతుల జీవనోపాధికి సంబంధించిన విషయంగా చూస్తోంది. మనదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉండడంతో చిన్న రైతులను కాపాడటానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి సుంకాలు తప్పనిసరి అని భారత్ వాదించింది.

గతంలోనూ ఈ విషయంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అమెరికా తీవ్రంగా ఆగ్రహం వ్య‌క్తం చేస్తోంది. మ‌రోవైపు భార‌త‌దేశం రష్యాతో వ్యాపారం చేయడాన్ని కూడా అగ్ర‌రాజ్యం జీర్ణించుకోలేకపోతోంది. దీంతంఓ భారత్‌పై సుంకాలను రెట్టింపు చేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ టారిఫ్‌లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడుతుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like