హైడ్రా మార్షల్స్ ఆందోళన..
హైదరాబాద్‌లో హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారి వేతనాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో అసంతృప్తికి లోనైన మార్షల్స్ విధులను బహిష్కరించారు. హైడ్రా మార్షల్స్‌లో చాలా మంది మాజీ సైనికులు ఉన్నారు. వీరు నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు, వర్షా కాలంలో వరదల సమస్యలను తగ్గించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కానీ, ఇటీవల వీరి వేతనాలను తగ్గించడంతో ఇది సరికాదని విధులను బహిష్కరించారు.
హైడ్రా సిబ్బంది డిమాండ్లు ఇవే…
హైడ్రాలో పనిచేసే మార్షల్స్ ఎక్కువగా మాజీ సైనిక ఉద్యోగులు. వీరిని 2020లో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో నియమించారు. వీరు ప్రస్తుతం హైడ్రాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం తమ జీతాలను తగ్గించడంతో వారంతా విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. దీనితో హైడ్రా కంట్రోల్ రూమ్, శిక్షణ, ప్రజావాణి సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కమిషనర్ రంగనాథ్‌ను సంప్రదించనున్నారు. వేతనాల తగ్గింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, తమ జీతాలు పెంచాలని, లేదా కనీసం గతంలో ఉన్న వేతనాలను కొనసాగించాలని కోరుతున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 8 గంటలకు మించి పనిచేస్తే, అదనపు సమయానికి వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పనికి తగ్గట్టుగా వసతులు కల్పించాలని కోరుతున్నారు.
అత్యవసర సేవలకు ఇబ్బందులు..
వారి ఆందోళన నేపథ్యంలో హైడ్రా కంట్రోల్ రూమ్, ప్రజావాణి సేవలు కూడా నిలిచిపోయాయి. సాధారణంగా వర్షాకాలంలో నీరు నిలిచిన రోడ్లు, లోతట్టు ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా టీమ్స్ రంగంలోకి దిగుతాయి. సమ్మె వల్ల ఈ సేవలు ఆగిపోయాయి. నగరంలోని 11 అండర్‌పాస్‌ల నిర్వహణ, క్యాచ్పిట్ల శుభ్రత, నాలాల క్లీనింగ్ లాంటి కీలక పనులు కూడా నిలిచిపోయాయి. వర్షం వస్తే నీరు నిలిచి, ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు మరింత తప్పవు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ఈ నిరసన కలవరపెడుతోంది. అత్యవసర సహాయం అవసరమైతే ఎవరు స్పందిస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వారి సమస్యలను పరిష్కరించి, సాధారణ సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.