కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్ర‌పూజ‌లు చేస్తారా..?

Occult worship at KCR’s farmhouse: మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్షుద్ర‌పూజ‌లు చేస్తార‌ని గ‌తంలో ప‌లువురు నాయ‌కులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌న ఫామ్ హౌజ్‌లో అధికారం ద‌క్కించుకునేందుకు, ఎదుటి నాయ‌కులపై సైతం ఈ పూజ‌లు నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు నిత్యం ఆరోప‌ణ‌లు గుప్పిస్తూనే ఉంటారు. తాజాగా మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి సైతం ఇదే వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. శ్రీశైలం ఎడమ కాలువ(SLBC) సొరంగం కూలడానికి కేసీఆర్ కుటుంబమే కారణమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ సొరంగం కూలిపోవాల‌ని కేసీఆర్ త‌న ఫాంహౌజ్‌లో క్షుద్ర‌పూజ‌లు చేశార‌ని ఆరోపించారు.

ఈ క్షుద్రపూజ‌ల‌కు సంబంధించిన మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై గ‌తంలో సైతం నాయ‌కులు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఏకంగా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సైతం కేసీఆర్ త‌న ఫాంహౌజ్‌లో క్షుద్ర‌పూజ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. బనకచర్ల వివాదంతో చంద్రబాబును భూతంగా చూపించడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌‌లో క్షుద్రపూజలు చేస్తున్నారని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో తాంత్రిక పూజలు చేస్తున్నారని బీజేపీ నేత బండి సంజయ్ సైతం ఆరోపించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చింది కూడా తాంత్రికుడి సూచన మేరకేనని చెప్పిన సంజ‌య్‌ కేసీఆర్ కు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకం లేదని.. తాంత్రికుడిని నమ్ముకుని దయ్యాల పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్ ఒక్కరే కాదు ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా పూజలు చేశారని అనంతరం వాటిని కాళేశ్వరం నీళ్లలో కలిపారన్నారు. ప్రతి మూడు నెలలకోసారి నల్ల పిల్లితో పూజలు చేస్తున్నారని ఫాంహౌజ్లో ఒక యువకుడు అనుమానాస్పదంగా చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

అయితే, ఈ వ్య‌వ‌హారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ వ‌స్తోంది. బీఆర్ఎస్ ఐటీ సెల్ ఈ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున స్పందించింది. కేసీఆర్‌ క్షుద్రపూజలు చేస్తారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ అప్పుడు స్పందించారు. సంజయ్‌ను ఇలాగే వదిలెయ్యకండి భాజపా బాబులు అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడని పేర్కొన్నారు. పిచ్చి ముదిరి తొందరలో కరవడం కూడా మొదలు పెడతారేమో.. ఎర్రగడ్డలో ఆయన కోసం బెడ్‌ తయారుగా ఉందని ఎద్దేవా చేశారు. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి అని భాజపా నేతలకు కేటీఆర్‌ సూచించారు.

ఇలా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌తిసారి క్షుద్ర‌పూజ‌ల వ్యాఖ్యానాలు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. అయితే, బీఆర్ఎస్ మాత్రం త‌మ నేత ప్ర‌జ‌లు బాగుండాల‌ని, సుఖ‌శాంతులతో ఉండాల‌ని య‌జ్ఞాలు చేస్తారు త‌ప్ప.. అలాంటి క్షుద్ర‌పూజ‌లు చేయ‌ర‌ని తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ నేత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..

Get real time updates directly on you device, subscribe now.

You might also like