వరదలో గర్భిణి… పోలీసులు ఏం చేశారంటే..
తెలంగాణ వ్యాప్తంగా మంగళ, బుధవారం రెండు రోజులు భారీ వర్షాల పడుతున్నాయి. ముఖ్యంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో వరద తీవ్రంగా ఉండడంతో గర్భిణీ, ఆమె కుటుంబ సభ్యులు గర్భిణీని వాగు దాటించే ప్రయత్నాలు చేశారు. ఇబ్బందులు ఎదురుకావడంతో పోలీసులు తాడు సాయంతో వాగు దాటించారు. తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, పోలీసు సిబ్బంది కలిసి తాడు సాయంతో వాగు దాటి వెళ్లి గర్భిణీని సురక్షితంగా దాటించారు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
సమస్యలో ఉన్నామని తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి తమకు సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని గర్భిణీ కుటుంబసభ్యులు చెబుతున్నారు. తమకు సాయం చేసిన పోలీసులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రజలు కూడా ఎస్ ఐ కిరణ్ కుమార్, పోలీసులు చేసిన సాయానికి ప్రశంసిస్తున్నారు.