ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామంలోని ఎస్.సి. కాలనీ, మండల కేంద్రంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్, నర్సాపూర్ ప్రాంతంలోని చెక్ డ్యామ్ పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేస్తామన్నారు. వాగులు, నదులు ఉదృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను, వాహనదారులను అటువైపుగా వెళ్లకుండా పోలీసు శాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్న ప్రాంతాలలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
తాగునీటికి ఇబ్బంది లేకుండా, వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజల తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736-250501 నంబర్ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్.డి.ఆర్. ఎఫ్. బృందాలు, రక్షణ పరికరాలతో తక్షణ సహాయం కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కలెక్టర్ వెంట బెల్లంపల్లి సబ్-కలెక్టర్ మనోజ్, తాండూర్ మండల తహసీల్దార్ జ్యోత్స్న తదితరులు ఉన్నారు.