పదే పదే నేరాలకు పాల్పడితే “గ్యాంగ్ ఫైల్స్” ఓపెన్ చేయాలి
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
Police Commissioner Amber Kishore Jha: కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిని అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. జులై నేర సమీక్షలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌లోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు పారదర్శకంగా నిర్వహించి వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలు పడే విధంగా సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ పని చేస్తే నేరాల నియంత్రణ, ప్రజల తో మంచి సత్సంబంధాలు పెరుగుతాయని తెలిపారు. ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెరగాలని, ఎవరైతే మళ్లీ, మళ్లీ దొంగతనాలకు పాల్పడడం, నకిలీ విత్తనాలు అక్రమ రవాణా, దోపిడీలు, దొంగతనాలు, గంజాయి ఇతర నేరాలకు పాల్పడిన వారిపై “గ్యాంగ్ ఫైల్స్” ఓపెన్ చేయాలన్నారు.
సైబర్ నేరాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీస్ అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన ఉండాలని… నేరాల నివారణ, దర్యాప్తునకు సిద్ధంగా ఉండాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేయాలని, గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా, సేవించడంపై నిఘా, నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నిందితులను పట్టుకొని కేసులు నమోదు చేసి జైలు కి పంపాలని, చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేదని, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి..
వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తనివ్వొద్దన్నారు. మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని, ప్రతి మండప నిర్వాహకుల వివరాలు తీసుకోవాలన్నారు. మండపం వద్ద తప్పని సరిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని, కీలక ప్రదేశాల్లో పికెట్లు ఏర్పాట్లు చేయాలన్నారు . విగ్రహం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు నిర్వాహకులదే బాధ్యత అని, నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లపై సంబందిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టినా, ఇతరులకు పంపించినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. కమీషనరేట్ పోలీసు కార్యాలయంలో సోషల్ మీడియా సెల్, కంట్రోల్ రూమ్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని నిరంతరం సామాజిక మాధ్యమ పోస్టులను పరిశీలిస్తామని సీపీ తెలిపారు.
అధికారులు, సిబ్బందికి క్యాష్ రివార్డ్..
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గంజాయి నియంత్రణ, నిర్మూలనలో కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కమిషనర్ రివార్డు అందించారు. ఈ కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్ఐ వెంకట్ స్వామి, మంచిర్యాల ఎస్ఐ తిరుపతి, ముగ్గురు ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, పదిహేను మంది కానిస్టేబుళ్లు , ఒక హెంగార్డుకు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రివార్డు అందించారు.
సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.