గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా.. కావాల‌య్యా యూరియా..

BRS Leaders Arrest : రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత అగ్రికల్చర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు (BRS Leaders Arrest) చేశారు.

యూరియా కొరత ఎప్పుడు తీరుతుంది..? రైతులకు పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో…? చెప్పాల‌ని.. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడి నుంచి కదలబోమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా.. కావాల‌య్యా యూరియా అంటూ ఖాళీ యూరియా సంచుల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు రోడ్లెక్కి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావుతోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం వ‌దిలేశారు.

అనంత‌రం హరీశ్ రావు… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. యూరియా కొరత తీర్చాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు సచివాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

You might also like