ప్ర‌మాద ర‌హిత సింగ‌రేణిగా తీర్చిదిద్దుదాం

-గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు
-సింగరేణి కార్మిక సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకుంటాం
-రక్షణ త్రైపాక్షిక సమావేశంలో సీఎండీ ఎన్.బలరామ్

Singareni:గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కార్మిక సంఘాలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలను తక్షణమే తీసుకుంటామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్ల‌డించారు. మంచిర్యాల జిల్లాలో జ‌రిగిన 49వ రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశంలో ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులు, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మికసంఘాల ప్రతినిధులు, సింగరేణి అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. సమావేశానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా అధ్యక్షత వహించారు.

కార్య‌క్ర‌మంలో సీఎండీ బలరామ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉత్పత్తిలో ఆదర్శప్రాయంగా ఉందని, రక్షణలో కూడా ప్రమాద రహిత కంపెనీగా రూపుదిద్దాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. ప్రతి కార్మికుని ప్రాణాలు ఎంతో విలువైనవని ప్ర‌మాదాలు జరగకుండా, వాటిని నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. యాజమాన్యంతో పాటు కార్మికులు కూడా రక్షణను ఖచ్చితంగా పాటించాలని కోరారు. చాలా ప్రమాదాలు నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ లేని పని ప్రదేశాల్లో విధులు నిర్వహించమని యాజమాన్యం ఎప్పుడూ ఒత్తిడి చేయదని స్ప‌ష్టం చేశారు.

ప్రతీ ఒక్కరూ కూడా స్వీయ రక్షణ అత్యంత ముఖ్యమన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. అలాగే మహిళా ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామ‌ని, వారి రక్షణ తప్పనిసరిగా సంస్థ చూసుకుంటుందని వెల్ల‌డించారు. ఈ సమావేశంలో గనుల్లో రక్షణ పెంపుదలకు కార్మిక సంఘాలు అనేక సూచనలు చేశాయి. నాణ్యమైన హెల్మెట్లు, బూట్లు సరఫరా చేయాలని, వైద్య సేవలు పెంపుదల, క్యాంటీన్లలో మెరుగైన సౌకర్యాలు. కొత్త యంత్రాల కొనుగోలు, ఆధునీకరణ, అవసరమైన సిబ్బంది నియామకం వంటి అనేక అంశాలపై గుర్తింపు కార్మిక సంఘం AITUC యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, AITUC జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు, INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఇతర నాయకులు పలు సూచనలు చేశారు.

ప‌లువురు మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మహిళలకు భూగర్భంలో అన్ని సౌకర్యాలు కల్పించార‌ని వెల్ల‌డించారు. కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ టి.ఆర్.కన్నణ్, ఇతర డి.జి.ఎం.యస్. అధికారులు సింగరేణి వ్యాప్తంగా రక్షణ పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సంస్థ డైరెక్టర్లు (ఈఅండ్ఎం) సత్యనారాయణ రావు (ఆపరేషన్స్) LV సూర్యనారాయణ, (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) వెంకటేశ్వర్లు, ( PA & W) గౌతం పొట్రూ IAS రక్షణ చర్యలపై ప్రసంగించారు. సమావేశంలో ముందుగా ఇటీవల పలు ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులకు సంతాపం ప్రకటించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like