హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ ఎంపీ

BJP agitation in Mancherial:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చేయ‌డం విఫ‌ల‌మైంద‌ని మాజీ ఎంపీ, బీజేపీ నేత బోర్ల‌కుంట వెంక‌టేష్ నేత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఆయ‌న మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌న్నారు. ఆ హామీలు అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్నారు. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని దుయ్య‌బ‌ట్టారు. వరదలతో ఎన్టీఆర్ నగర్ ప్రజలు, రైతులు నష్టపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం బాధితులను ఆదుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే మంజూరు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని, ఎన్టీఆర్ నగర్ నీట మునిగిన ఇండ్ల వరద బాధితులకు నష్టం పరిహారం, వరదతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ ఆధ్వ‌ర్యంలో ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముందుగా మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాద యాత్రగా వెళ్ళిన అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట వరద బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ ని కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వరద బాధితులకు నష్ట పరిహారం అందించాలని వినతి పత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో ముల్కల్ల మల్ల రెడ్డి, కొయ్యల హేమాజీ, దుర్గం అశోక్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎలగందుల కృష్ణ మూర్తి, జోగుల శ్రీదేవి, గాజుల ముఖేష్ గౌడ్, కమలాకర్ రావు, ముత్తె సత్తయ్య, బియ్యాల సతీష్ రావు, మంత్రి సురేఖ, వైద్య శ్రీధర్, అమిరిశెట్టి రాజ్ కుమార్, కుర్రె చక్రి, గోలి రాము తదితరులు పాల్గొన్నారు.

You might also like