భారీ వర్షాలతో ఉత్పత్తిలో వెనుకంజ
Singareni:భారీ వర్షాల నేపథ్యంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యంలో వెనకబడింది. ఈ ఏడాది వార్షిక లక్ష్యం 78 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా గడిచిన ఐదు నెలల్లో 25.64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా, 24.19 మిలియన్ టన్నులు మాత్రమే సాధించగలిగింది. 1.45 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనకబడింది. సింగరేణి వ్యాప్తంగా 94 శాతం ఉత్పత్తి సాధించింది. ఆగస్టు నెలకు సంబంధించి సైతం ఉత్పత్తి సక్రమంగా సాగలేదు. భారీవర్షాల నేపథ్యంలో లక్ష్యం చేరుకోలేకపోయింది. ఆగస్టులో 4.82 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 4 మిలియన్ టన్నులు మాత్రమే సాధించింది. అంటే లక్ష్యానికి 8.2 లక్షల టన్నుల వెనుకంజలో ఉంది.
ఈ ఏడాది 78 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 24.19 మిలియన్ టన్నులు సాధించింది. రానున్న ఏడునెలల్లో 56.81 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. వార్షిక ఉత్పత్తి లక్ష్యం సాధించాలంటే నెలకు 8 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
సింగరేణి వ్యాప్తంగా మూడు డివిజన్లు మాత్రమే వంద శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయి. ఆగస్టులో కొత్తగూడెం, ఆర్జీ-1, 2, డివిజన్లు మాత్రమే వందశాతం ఉత్పత్తి సాధించాయి. అయిదు నెలల ఉత్పత్తిలో కూడా కొత్తగూడెం, ఆర్జీ-2, మణుగూరు డివిజన్లు మాత్రమే వంద శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించాయి. మిగతా అన్ని డివిజన్లు తక్కువ స్థాయిలోనే బొగ్గు ఉత్పత్తి చేపట్టాయి.