మంచిర్యాలలో యువతను మత్తుకు బానిస చేస్తున్నారు
గ్యాంగ్ గొడవలపై బీజేపీ నేత కస్తూరి నాగరాజు ఆందోళన
మంచిర్యాల నియోజకవర్గంలో పెరుగుతున్న గ్యాంగ్ గొడవలు, బహిరంగ దాడులు, మత్తుపదార్థాల వినియోగం ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, ప్రజలకు భద్రత కల్పించాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న గ్యాంగ్ గొడవలు, బహిరంగ దాడులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. యువతలో మత్తుపదార్థాల వినియోగానికి సంబంధించిన ఆరోపణలు మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై భయాందోళనలకు గురవుతున్నారని నాగరాజు అన్నారు.
స్థానికంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరాటాల్లో యువకులను ఉపయోగించుకుంటూ, వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. మత్తుపదార్థాల బారిన పడుతున్న యువతను గొడవలు, దాడులకు ప్రేరేపిస్తున్నారనే ఫిర్యాదులపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును కాపాడటంతో పాటు మత్తుపదార్థాల సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాలలో తరచూ చోటుచేసుకుంటున్న గొడవలు, దాడుల కారణంగా ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై నెలకొన్న భయాలు వ్యాపార వాతావరణాన్ని, పెట్టుబడుల అవకాశాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టే సందర్భాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి రాజకీయ నాయకులను నియంత్రిస్తున్న పోలీసులు, అదే స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణ ఎందుకు చేపట్టడం లేదనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పోలీసింగ్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు.