మంచిర్యాలలో ఉద్రిక్తత
మంచిర్యాలో కాంగ్రెస్ నేతల మధ్య పోరు కాస్తా ఉద్రిక్తతకు దారి తీస్తోంది. రెండు వర్గాల మధ్య పోరు దాడుల దాకా వెళ్లడం… మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. సద్దుల బతుకమ్మ రోజు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో చోటుచేసుకున్న వివాదం మరువకముందే.. దసరా రోజున జరిగిన మరో గొడవతో మంచిర్యాల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనలకు సంబంధించి మంత్రి వివేక్ వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వరుస దాడుల నేపథ్యంలో పోలీసులు పరిస్థితి సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ నేత జగన్ మోహన్ రావు ఇంటిపై ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు వర్గీయులు దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జగన్ మోహన్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. నేతల మధ్య వర్గపోరు కాస్తా దాడుల వరకు వెళ్లడంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
దండేపల్లి మండలం తాళ్లపేటలో సైతం కఠిన పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి.. మంత్రి వివేక్ వర్గానికి చెందిన మాజీ వైస్ ఎంపిపి ఆకుల రాజేందర్ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు గ్రామ గిరిజన మహిళా సర్పంచ్ కుర్సింగ కళావతి, ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి, మాలమహానాడు నాయకులు మాడ దయాకర్ ను గత రాత్రి నుండి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.