BRS నుండి కవిత సస్పెండ్

Kalvakuntla Kavitha:భారత రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉద్వాసన పలికారు. కవితపై బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాలతో కవితను సస్పెండ్‌ చేశారు. సొంతపార్టీ నేతలపైనే కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమెను సస్పెండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ లేఖ విడుదల చేసింది.

కవిత ఈ మధ్య సొంత పార్టీ నేతల పైనే బాణాలు ఎక్కుపెట్టారు. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కవితకు ఉద్వాసన చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అనుకున్నట్టుగానే ఆమెకు ఉద్వాసన పలికారు.

KCR చుట్టూ దయ్యాలు ఉన్నారని కవిత రాసిన లేఖ సంచలనం సృష్టించింది. అది మరవకముందే మాజీ మంత్రి జగదీశ్వరెడ్డిని ఉద్దేశించి లిల్లీపుట్ వ్యాఖ్యలతో కవిత లక్ష్మణ రేఖను పూర్తిగా దాటేశారని అధిష్టానం భావించింది. కవిత జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన లిల్లీపుట్ వ్యాఖ్యలు పార్టీలో పెను సంచలనానికి తెరలేపాయి. తెలంగాణ ఉద్యమంతో కానీ, బీఆర్ఎస్ తో కానీ జగదీశ్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని? కవిత ప్రశ్నించారు. ఆయన ఓ లిల్లీపుట్ నాయకుడంటూ దుయ్యబట్టారు. తానెవరో తెలియకుండానే ఇంత కాలం బీఆర్ఎస్ లో ఉన్నారా అంటూ నిలదీశారు. అలాగే మరో నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డిపై కూడా విమర్శల వర్షం కురిపించారు. వీళ్లంతా పార్టీలో చేరి పదవులు అనుభవించి ఇప్పుడు తనపై విమర్శలు చేసే స్థాయికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడితో ఆగని కవిత.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తన సోదరుడు కల్వకుంట్ల తారకరామారావుపైనా పరోక్షంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీలోని అగ్ర స్థాయిలో ఉన్న నేతలు తన కార్యకలాపాలపై నిఘా పెట్టారని పరోక్షంగా కేటీఆర్, హరీష్ రావులపై ఆరోపణలు గుప్పించారు.

ఇక ఆమె సింగరేణి కేంద్రంగా సైతం పలు నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి జాగృతి పేరుతో ప్రత్యేక కుంపటి ఏర్పాటు చేయడమే కాకుండా, HMS తో కలిసి పనిచేస్తామని ప్రకటించింది. ఇక తాజాగా హరీష్ రావు, సంతోష్ రావు లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. ఇలా వరుసగా సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు గుప్పిస్తుండటంతో పార్టీ. సీనియర్లు పలువురు కవితపై చర్య తీసుకోవాలని కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. కవిత తీరు వల్ల పార్టీకి తీవ్ర నష్టంవాటిల్లోతోందని వివరించారనీ, దీంతో ఆమెకు ఉద్వాసన పలకడమే మేలని కేసీఆర్ కూడా భావించడంతో ఆమెకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like