మీ ఇంటి వ‌ద్ద‌కే ఎరువులు పంపిస్త‌..

MLA Kokkirala Prem Sagar Rao: మీ గ్రామానికే.. మీ ఇంటి సమీపంలోనే ఎరువుల పంపిణీ జరిగేలా చ‌ర్యలు తీసుకుంటాన‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. రెండు, మూడు రోజుల్లో ఎరువులు పంపిణీ జరుగుతుందని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. బుధవారం లక్షెట్టిపేట‌ ఐబీ గెస్ట్ హౌస్ వద్ద నిర్వ‌హించిన దండేపల్లి, హజీపూర్, లక్షెట్టీపేట్ మండలాల రైతుల సమావేశంలో హైదరాబాద్ నుంచి ఆయ‌న వీడియో కాల్ లో మాట్లాడారు. మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి 400 టన్నుల ఎరువులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. 8,800 బస్తాలలో నాలుగు వేల బస్తాలు దండేపల్లి మండలానికి, మూడు వేలు, లక్షెట్టీపేట్ మండలానికి 1,200, హజీపూర్ మండలానికి 500 బస్తాలు మంచిర్యాల, నస్పూర్ మండలాలకు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

ఈనెల 9,10 తేదీల లోవు పూర్తి కోట 72 వేల బస్తాలు సరఫరా అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఎరువుల కోసం ఆందోళన చెంది భారీ క్యూలైన్లో నిలుచుని ఇబ్బంది పడవద్దని కోరారు. గ్రామానికి ఎరువులు తీసుకువచ్చి రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎరువులు అందక ఎకరం పంటకు నష్టం జరిగినా నాదే బాధ్యత అని స్పష్టం చేశారు. రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పారు. వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు పరిహారం అక్టోబర్ మాసం ముగింపు లోపు ఇప్పిస్తానని ప్రేమ్ సాగర్ రావు భరోసా ఇచ్చారు. పంట నష్టం సర్వే జరిగితే తప్ప కేంద్రం పరిహారం విడుదల చేయదన్నారు.

వ‌ర‌ద నీటి ప్ర‌వాహం త‌గ్గిన త‌ర్వాత కేంద్ర, రాష్ట్ర అధికార యంత్రాంగం పంటలు, రహదారులు ఇతర ప్రకృతి నష్టాన్ని పర్యటనలో అంచనా వేస్తారని తెలిపారు. 20 యేండ్లు అధికారం అనుభవించిన వ్యక్తి రైతులకు ఏమి మేలు చేశాడని ప‌రోక్షంగా మాజీ ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావును ఎద్దేవా చేశారు. వరద నష్ట ప‌రిహారం ఇవ్వడం లేదని కపట ప్రేమ ఒలకపోసే నాయకునికి పంట నష్టం ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియకపోవడం అజ్ఞానానికి నిదర్శనమన్నారు. నన్ను నమ్మిన రైతులు, ప్రజానీకానికి ఎలాంటి కష్టాలు రానివ్వనని పునరుద్ఘాటించారు. పూటకో మాట మాట్లాడనని చెప్పింది చేసి తీరుతానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నొక్కి చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like