ఫార్ములా-ఈ కేసు ఒక లొట్టపీసు కేసు
KTR: ఫార్ములా-ఈ కేసు ఒక లొట్టపీసు కేసు, అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో తాను ఇక్కడే ఉంటానని, ఎవరైనా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని ఆయన సవాలు విసిరారు. హైదరాబాద్‌కి ఫార్ములా-ఈ రేసు తీసుకురావడానికి తాను అన్ని ప్రయత్నాలు చేశానని తెలిపారు. ఈ రేస్ కోసం ప్రభుత్వం నుండి రూ. 46 కోట్లు ఇవ్వాలని తానే ఆదేశాలు ఇచ్చానని, ఆ డబ్బులు నేరుగా నిర్దేశిత ఖాతాలోకి చేరాయని స్పష్టం చేశారు. ఇందులో రూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉందని, అలాంటప్పుడు అవినీతి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రాసిక్యూషన్ చేసినా, ఛార్జ్ షీట్లు వేసినా ఏమీ చేయలేరని అన్నారు.
“సీఎం, నేను ఇద్దరం కలిసి లై డిటెక్టర్ పరీక్షను టీవీ ఛానల్ ముందు ఎదుర్కొందాం,” అని సవాలు విసిరారు. గతంలో రూ. 50 లక్షల నోట్ల కట్టలతో కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారని కేటీఆర్ వెల్లడించారు. ఈ పరీక్షతో ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఫార్ములా-ఈ కేసును ముందుకు తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. తాము మాత్రం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపై పోరాడుతామని మరోసారి పునరుద్ఘాటించారు.