ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్.. పది మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య జరుగుతున్న కాల్పుల్లో 10 మంది నక్సల్స్ చనిపోయారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యడు ఒకరు ఉన్నారు. తెలంగాణకు చెందిన మోడెం బాలకృష్ణ మృత్యువాత పడ్డారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఇతనిపై రూ. కోటి రివార్డు ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్ట్‌లు నేలకొరిగారు. తాజాగా గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో 10 మంది మావోయిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఉన్నారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా. ఇతడిపై కోటి రూపాయల రివార్డ్ ఉంది.
మరోవైపు.. ఇదే ఎన్‌కౌంటర్‌లో ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి.. 10 మంది మావోయిస్ట్‌ల మృతదేహాలతోపాటు భారీ మొత్తంలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో గరియాబంద్ ఈ30, కోబ్రా జవాన్లు, ఎస్‌టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా అనుక్షణం పర్యవేక్షించారు.
ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలోని ఐఈడీ పేలి ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. మందుపాతరలను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ సమయంలో ఈ పేలుడు సంభవించినట్టు దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు. గాయపడిన ఇద్దరు జవాన్లలో ఒక ఇన్‌స్పెక్టర్ కూడా ఇన్నటు ఆయన పేర్కొన్నారు. గాయపడిన ఇద్దరు ప్రతస్తుం దంతేవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. మెరుగైన వైద్య సంరక్షణ కోసం వారిని రాయ్‌పూర్‌కు హెలికాప్టర్ ద్వారా తరలించనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.