సింగరేణిలో అవినీతి.. ప‌ది శాతం కాంగ్రెస్ పెద్ద‌ల‌కు..

Singareni: సింగ‌రేణిలో ప్రతి కాంట్రాక్ట్ లో 25 శాతం అవినీతి జరుగుతోందని.. అందులో 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని క‌ల్వ‌కుంట్ల క‌విత ఆరోపించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం నిర్వ‌హించారు. ఇందులో ఆమె పాల్గొని ప్ర‌సంగిచారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే కరెప్షన్ పార్టీ అని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. సింగరేణిలో తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారన్నారు. సింగరేణిలో అవినీతి ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమ‌ని. చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, సీఎంలను డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సీబీఐకీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామ‌ని క‌విత స్ప‌ష్టం చేశారు. సింగరేణిలో అవినీతికి వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు.

గుర్తింపు సంఘం వాళ్లు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, నిజానికి సింగరేణి ఎన్నికల్లో వాళ్లకు గెలిచే అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. టీబీజీకేఎస్ మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదని, అప్పుడు ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ పరిస్థితి వచ్చింద‌న్నారు. టీబీజీకేఎస్ నాయకులు అవినీతి చేయొద్దని గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను.. అయినా నాయకులు స్వార్థంతో అవినీతి చేశారని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కార్మిక సంఘాల్లో యువతను ప్రోత్సహించాలని కోరినా పట్టించుకోలేదని స్ప‌ష్టం చేశారు. నిన్నటి దాకా ఉన్న సంఘంపైనే విమర్శలు ఏంటని కొందరు అనవచ్చు..? కానీ అక్కడ జరిగిన పరిస్థితులపై ఖ‌చ్చితంగా మాట్లాడాల్సిన అవసరముందని స్ప‌ష్టం చేశారు.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కొత్త కొర్రీలు పెడుతున్నారని క‌ల్వ‌కుంట్ల క‌విత ఆరోప‌ణ‌లు గుప్పించారు. పదో తరగతి పాస్ కాలేదంటూ 470 ద‌ర‌ఖాస్తులు ఆపేశారని.. చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మైన్స్, మినరల్స్ ను వినియోగించుకొని ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నారు. సింగరేణి ప్రాంత ప్రజలకు దక్కాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 వేల కోట్ల బకాయిలు పెట్టి నష్టాల్లోకి నెట్టేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా చేస్తే సంస్థ భవిష్యత్ ఏం కావాలని..? ఆమె ప్ర‌శ్నించారు.

గతంలో సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచుకోలేకపోయాం.. దానికి పరిష్కారంతో పాటు మెడికల్ బోర్డు తెచ్చుకునేందుకు పోరాటం చేద్దామ‌న్నారు. సింగరేణి లో పనిచేయటమంటేనే ఎంతో రిస్క్ తో కూడుకున్నదని… ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే వారికి పూర్తి స్థాయిలో భద్రత ఉండదన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో సంస్థలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ విధానం కొనసాగాలన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను మనుషులే కాదన్నట్లుగా చూస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త్వరలోనే జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ గెలుస్తుందని ధీమాగా చెప్తున్న.. రాబోయే ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురబోతోందని చెప్పారు. హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నారు.. మీరిచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మికుల బాగు కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నానని వెల్ల‌డించారు.

క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికున్నారు. ఈ నేప‌థ్యంలో కవితను హెచ్ఎంఎస్, సింగరేణి జాగృతి నాయకులు ఘ‌నంగా స‌న్మానించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like