కండ్ల‌లో కారం కొట్టి.. అట‌వీశాఖ అధికారుల‌పై దాడి

పాత కేసులో కొంత మందిని బైండోవ‌ర్ చేయ‌డానికి వెళ్లిన అట‌వీ శాఖ సిబ్బందిపై ఆదివాసీలు తిర‌గ‌బ‌డ్డారు. వారిపై కారం చ‌ల్లి మ‌రీ దాడి చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు దాడి చేశారు. పాత అటవీశాఖ కేసులో కొంత మందిని బైండోవర్ చేయడం అట‌వీ శాఖ అధికారులు వెళ్లారు. అయితే, అటవీశాఖ సిబ్బందిపై కారం చల్లి స్థానికులు వెంటపడ్డారు.. కారంపొడి మీద చల్లి వెంటపడడంతో అటవీశాఖ సిబ్బంది వెనుతిరిగి పరుగు లంకించుకున్నారు. ఎఫ్ఎస్ఓ బాలకృష్ణ, ఎఫ్బీఓ పరమేశ్వర్, బేస్ క్యాంప్ వాచర్ రాజేందర్ పై దాడి జరిగినట్లు అటవీశాఖ అధికారులు వెల్ల‌డించారు.

త‌మ‌పై కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అట‌వీ శాఖ సిబ్బంది.. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని, తమపై జరిగిన దాడి ఫోటోలు, ఇతర ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే స‌మ‌యంలో అటవీశాఖ సిబ్బందిపై సైతం ఆదివాసీ మ‌హిళ‌లు తీవ్ర ఆరోపణలు చేశారు. తాము వాగులో స్నానం చేస్తుంటే వీడియోలు తీసారని.. అందుకే తిరగబడ్డామని వెల్ల‌డించారు.

అటవీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి సుష్మ తెలిపారు. లింగాపూర్ బీట్, తాళ్లపేట రేంజ్ లో దండేపల్లి మండలం దమ్మన్నపేట, మామిడిగూడ ప్రాంతాల ఆక్రమణదారులు ప్రణాళికబద్ధంగా అటవీ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్వో) బాలకృష్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బిఓ) పరమేశ్వర్, బేస్ క్యాంప్ వాచర్ రాజేందర్ పై కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి మిర్చి పొడిని అటవీ సిబ్బంది కళ్ళపై చ‌ల్లార‌ని తెలిపారు.

.

Get real time updates directly on you device, subscribe now.

You might also like