మహిళలకు అండగా షీ టీమ్స్
బాధిత మహిళలకు పోలీస్ ఎల్లప్పుడూ అండగా అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. స్థానిక డీసీపీ కార్యాలయంలో శనివారం షీటీమ్, మహిళా పోలీస్ స్టేషన్, భరోసాసెంటర్ సిబ్బందితో సమీక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జోన్ పరిధిలో ఈ సంవత్సరం ఆగస్టు వరకు షీ టీమ్స్ 81 మంది పోకిరీలను పట్టుకున్నారని తెలిపారు. మంచిర్యాల జోన్ షి టీంకి మొత్తం అందిన ఫిర్యాదులు 114 కాగా, వాటిలో క్రిమినల్ కేసులు 18, పెట్టి కేసులు 07 ఉన్నాయన్నారు. ఇందులో 89 మందికి కౌన్సెలింగ్, వార్నింగ్ ఇచ్చామన్నారు.
జిల్లాలో షీ టీమ్స్ ఇదివరకే గుర్తించిన హాట్ స్పాట్స్ ప్రతీరోజు సందర్శించాలని సూచించారు. ఈవ్ టీజర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని తెలిపారు. స్కూళ్లు, కళాశాలలు, జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. భరోసా కేంద్రాలలో బాధిత మహిళ, బాలికకు వైద్యం, కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందించడంతో పాటు, పోలీసులు అండగా ఉంటారనే మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. భరోసా సెంటర్లో లీగల్ అడ్వైజర్, కౌన్సిలర్, మెడికల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు లేదా బాలికలకు సంబంధించి కేసు పోలీస్ స్టేషన్లో నమోదు అయినప్పటి నుంచి బాధితులకు మద్దతుగా ఉండి, వారికి భరోసా కల్పించాలన్నారు.
మహిళలు విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దని డీసీపీ భాస్కర్ స్పష్టం చేశారు. సమాజంలో మహిళలు, బాలికలు తెలిసిన వారితోనే ఎక్కువ వేధింపులకు గురవుతున్నారని, అలాంటప్పుడు జాగ్రత్త పడాలి తప్ప అధైర్య పడవద్దన్నారు. వేధింపులకు పాల్పడిన వారి వివరాలతో షీటీంని సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. అప్పుడే వారి ఆట కట్టించి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళలు వేధింపులకు గురి అయినప్పుడు రామగుండం షీటీం వాట్సాప్ నెంబర్ 6303923700, మంచిర్యాల షీటీం 8712659385 నెంబర్, 100కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమావేశంలో మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, మంచిర్యాల జోన్ షీటీం ఇన్చార్జి మహిళా ఎస్సై ఉషారాణి, హైమ పాల్గొన్నారు.