యూరియా బస్తాల దొంగతనం
Theft of urea bags:ఇప్పుడు రైతులకు యూరియా దొరకడం గగనమైంది… ఒక్క యూరియా బస్తా కోసం రైతులు రోజుల తరబడి కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆ యూరియా బస్తా దొరికితే బంగారం దొరికినంత సంబరం అవుతోంది… మరి ఆ యూరియా బస్తాలు దొంగతనం జరిగితే… కష్ట,నష్టాలకు ఓర్చి తెచ్చుకున్న యూరియా దొంగతనం కావడంతో రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు. తన యూరియా దొంగిలించినవారిని పట్టుకోవాలని పోలీస్‌స్టేషన్ మెట్లెక్కాడు…
కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలో యూరియా దొరకాలంటే ఇబ్బందులు అవుతున్నాయి. దాదాపు నెల రోజులుగా ఇక్కడ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. చివరకు రోడ్డెక్కారు… ధర్నాలు సైతం చేశారు. అయితే, ఓ చేను వద్ద వేసిన 14 యూరియా బస్తాలను కొందరు వ్యక్తులు దొంగిలించారు. అలవేణి తిరుపతి అనే రైతు తన చేను వద్ద యూరియా బస్తాలు వేశాడు. వాటిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. దీంతో తిరుపతి పోలీసులను ఆశ్రయించాడు.
గతంలో టమాట రేటు పెరగడంతో టమాట పంటను ఎత్తుకెళ్లారు. ఇలా ఏది డిమాండ్ పెరిగితే దానిని ఎత్తుకుపోవడం అలవాటుగా మారింది. ప్రస్తుతం యూరియాకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఏకంగా యూరియా బస్తాలు ఎత్తుకుపోవడంతో అందరూ అవాక్కవుతున్నారు. పోలీసులు వెంటనే నిందితున్ని పట్టుకుని రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నారు.