మంత్రి ఇంటిని ముట్టడించిన అంగ‌న్‌వాడీలు

Anganwadi workers besiege minister’s house:మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్ ఇంటి ముందు అంగన్ వాడిలు ధ‌ర్నా నిర్వ‌హించారు. అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఇంటిని ముట్టడించారు. మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ కాలనీలోని మంత్రి వివేక్ ఇంటి ముందు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఆందోళన నిర్వ‌హిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా అంగ‌న్‌వాడీ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షురాలు కే. సునీత మాట్లాడుతూ మంత్రి చ‌ర్చ‌ల‌కు తొమ్మిది గంట‌ల‌కు స‌మ‌యం ఇచ్చార‌ని చెప్పారు. అయితే, ఉద‌యం ఏడుగంట‌ల నుంచే అరెస్టులు మొద‌లు పెట్టార‌ని ఇది దారుణ‌మ‌న్నారు. మంత్రుల‌కు త‌మ వాయిస్ వినిపిద్దామ‌ని వ‌స్తే మంత్రులు, ప్ర‌భుత్వం మ‌హిళ‌లు అని చూడ‌కుండా అరెస్టులు చేయ‌డం ఏమిట‌న్నారు.

అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్ లేక‌పోతే అంగ‌న్‌వాడీ నిర్వీర్యం అవుతుంద‌న్నారు. ఐసీడీఎస్ ప్రైవేటీక‌ర‌ణ అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు. అంగ‌న్‌వాడీ కేంద్రాల్లోనే ఇంగ్లీషు మీడియం పాఠ‌శాల‌లు పెట్టాల‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే రూ. 18 వేలు ఇస్తామ‌ని చెప్పింద‌ని అది కూడా అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కింద టీచ‌ర్ల‌కు రూ. 2 ల‌క్ష‌లు, హెల్ప‌ర్ల‌కు రూ. 1 ల‌క్ష ఇస్తామ‌ని గ‌త చ‌ర్చ‌ల్లో సీత‌క్క ఒప్పుకున్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేద‌ని వెంట‌నే అమ‌లు చేయాల‌న్నారు.

తెలంగాణ అంగ‌న్‌వాడీ టీచ‌ర్స్ అండ్ హెల్ప‌ర్స్ యూనియ‌న్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి త్రివేణి మాట్లాడుతూ తాము సామ‌ర‌స్యంగా మాట్లాడ‌దామ‌ని వ‌స్తే దుర్మారంగా అరెస్టు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. త‌మ న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌మంటే ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. మా జీతభ‌త్యాలు త‌గ్గించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎప్పుడో ఇచ్చిన 2జీ ఫోన్లు ప‌నిచేయ‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన‌ట్లు రూ.18 వేలు చెల్లించాల‌న్నారు. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌క‌పోతే ఖ‌చ్చితంగా భారీ పోరాటాలు చేస్తామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like