రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా

Ktr Vs Bandi Sanjay: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బండి సంజయ్ కుమార్‌పై పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కూడా కేటీఆర్ ఈ దావా దాఖలు చేశారు. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను ప్రచురించినందుకు.. ప్రసారం చేసినందుకు ఈ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో బండి సంజయ్ పైన రూ. 10 కోట్ల పరువు నష్టానికి కేసు వేశారు. తన పరువు నష్టం కలిగించే సమాచారాన్ని తొలగించాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

2025 ఆగస్టు 8న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలలో.. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SBI) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్ ఆర్థిక అవకతవకలకు తనను ముడిపెట్టారని తెలిపారు. ఈ వ్యాఖ్యలను పలు తెలుగు టీవీ ఛానెల్స్ పాటు నేషనల్ ఛానెల్స్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఎక్స్, యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలలో విస్తృతంగా ప్రసారమయ్యాయని ఫిర్యాదులో కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశించినవని కేటీఆర్ తెలిపారు. 2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినా, బండి సంజయ్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదని తెలిపారు.

తన పరువు నష్టం దావా కేసులో భాగంగా కేటీఆర్ బండి సంజయ్ నుండి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా పోర్టల్‌ల నుండి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇక ఈ కేసును హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి విచారించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like