యూరియా కోసం ఆందోళ‌న అవ‌స‌రం లేదు

మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేస్తామ‌ని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులతో మాట్లాడారు. సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. బీమారం మండలంలో గత సంవత్సరం 14 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించార‌ని, ఈ సంవత్సరం ఇప్పటికే 11 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామ‌న్నారు. ఇంకా మండలంలో అవసరం ఉన్న ప్రకారం 3,4 రోజులలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలలో యూరియా అందుబాటులో ఉంచుతామ‌న్నారు. రైతులు ఎట్టి ప‌రిస్థితుల్లో ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ మ‌రోమారు స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తోంద‌ని, నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల పరిశీలించారు. మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యమైన నిత్యవసర సరుకులు, తాజా కూరగాయలను వినియోగించాలని, వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి ప్రశ్నలు అడిగి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు.

You might also like