కారుణ్య నియామకాల్లో పట్టభద్రుల‌కు క్లరికల్ పోస్టులు

Singareni:గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులను ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. ఈ విషయంపై గురువారం హైదరాబాద్ విద్యానగర్ లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, సింగరేణి యాజమాన్యానికి మధ్య ఒప్పందం కుదిరింది.

గతంలో ఈ విద్యార్హత ఉన్న వారికి కేవ‌లం జనరల్ అసిస్టెంట్ మాత్రమే పనిచేసే అవకాశం దక్కేది. 2009లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం టెక్నికల్ డిగ్రీలైన మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా(మైనింగ్/మెకానికల్/ఎలక్ట్రికల్), ఐటీఐ(ఎలక్ట్రికల్/ఫిట్టర్/వెల్డర్) కోర్సులు పూర్తి చేసిన వారికి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు కల్పించడానికి అంగీకరించారు.

వీరితో పాటు ఇతర డిగ్రీలు కలిగిన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులో నియామకం కల్పించాలని సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోరింది. దీంతో జూన్ 27న డైరెక్టర్ (పా) స్థాయి సమావేశంలో చర్చించారు. సంస్థ సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్(పర్సనల్) గౌతమ్ పొట్రు ఆదేశాల మేరకు 2025 సెప్టెంబర్ 5న సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తో యాజమాన్యం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది.

ఆ తర్వాత యూనియన్ ప్రతినిధులు, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోమారు చర్చల అనంతరం త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించడంతో గురువారం ఒప్పందం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) విశ్వ భూషణ్, సింగరేణి తరఫున డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రు, జిఎం(యూజి మైన్స్) రఘురామి రెడ్డి, జిఎం(పర్సనల్) ఐఆర్&పిఎం కవితా నాయుడు, జిఎం(హెచ్ఆర్డి) వెంకట రామరెడ్డి, జిఎం(సివిల్) డి.వెంకటేశ్వర్లు, జిఎం (ఎంఎస్) రవిబొజ్జా, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు ఎం.రంగయ్య, కె.వీరభద్రయ్య, ఎం.సమ్మయ్య, మద్ది ఎల్లయ్య, వై.వి.రావు పాల్గొన్నారు .

ఈ ఒప్పందం ప్రకారం..
గని ప్రమాదం లో మరణించిన ఉద్యోగి కుటుంబంలో అర్హులైన టెక్నికల్ డిగ్రీ ఉన్న వారసులు లేక‌పోతే ఏదైనా ఇతర డిగ్రీ అర్హత ఉన్న వారు గ్రేడ్-3 క్లర్కు పోస్టుకు అర్హులు. సంస్థలో గ్రేడ్-3 క్లర్కు పోస్టుల లభ్యత బట్టి కంపెనీ వీరికోసం నిర్వహించే ప్రత్యేక పరీక్షలో డిగ్రీ అర్హత గల వారసులు పాల్గొనాల్సి ఉంటుంది. పరీక్షలో పాసైన వారు మాత్రమే గ్రేడ్-3 క్లర్కు పోస్టులో నియామకానికి అర్హత సాధిస్తారు. గ్రేడ్ 3 క్లర్కు పోస్టుల అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కాని వారసులకు జనరల్ అసిస్టెంట్(కేటగిరీ-1) గా ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like