రేపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
Notification for the local body elections tomorrow:తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్. ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రత్యక్ష ఎన్నికల అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్లు, 31 జిల్లా పరిషత్లకు చైర్పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొంది. రేపు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రేవంత్ సర్కార్ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే బీసీలకు 42 శాతం కోసం ప్రత్యేక జీవో విడుదల చేసింది. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో రేపు సాయంత్రం వరకు స్థానిక ఎన్నికల షెడ్యూల్‌తో కూడిన నోటిఫికేషన్‌లు వెలువడనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్లను ఖరారు చేయగా.. గ్రామ, మండల, జడ్పీటీసీల వారీగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తోంది. ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సామగ్రి, యంత్రాంగానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్‌పర్సన్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలను ఆయా సామాజికవర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేసినట్లు సమాచారం. రిజర్వేషన్లు, జనాభా, సామాజిక వర్గాల వారీగా ఎలా ఉన్నాయన్న అంశాలపై జిల్లాల కలెక్టర్లు బుధవారం మరోసారి పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో భద్రపరిచి ఉంచగా.. ఒక సెట్‌ను బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. వాటిని పంచాయతీరాజ్ శాఖ మరోసారి పరిశీలించనుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. అయితే ఏ ఎన్నికలు మొదలు జరుగుతాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే మొదలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని సమాచారం. ఆ తరువాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సర్పంచ్ ఎన్నికలు 2 దశల్లో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ప్రత్యేక జీవో విడుదలైన అనంతరం ఏ ఎన్నికలు మొదట నిర్వహిస్తారనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థలకు తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని పలువురు కాంగ్రెస్ పెద్దలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తారా..లేదా వేచి చూడాల్సిందే.