న్యాయ‌వాది నుంచి డీజీపీ దాకా..

Shivdhar Reddy as new DGP:తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ గా 1994 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ శివధర్ రెడ్డి ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఆయ‌న‌ను డీజీపీగా నియ‌మిస్తూ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డ‌ర్ అందుకున్నారు.

కొత్త డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ పెద్దతుండ్ల గ్రామం. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్స్ కు ఎంపిక‌య్యారు. 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి వ‌చ్చారు. ఆయ‌న మొద‌ట‌గా విశాఖ జిల్లాలో ఏఎస్పీగా విధులు నిర్వ‌హించారు. అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో ఆయ‌న ఏఏస్పీగా పనిచేశారు. గ్రేహౌండ్స్, స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. ఆయ‌న మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్‌..
శివ‌ధ‌ర్ రెడ్డి 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ఆయ‌న‌ను నియ‌మించారు. 2014-2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్‌ గా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించింది. ఆ సమయంలోనే నల్గొండ జిల్లా జానకీపురంలో సిమీ ఉగ్రవాదుల కలకలం, వరంగల్ జిల్లా అలేరు వద్ద వికారుద్దీన్ తదితరుల ఎస్ంటర్, షాద్ నగర్ వద్ద జరిగిన కాల్పుల్లో నేరగాడు నయీం హతం వంటి ఘటనలు జరిగాయి.

శాంతి ప‌రిర‌క్ష‌ణ ద‌ళంలో సైతం..
ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సంచ‌ల‌న‌ కేసులను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2016 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ ప‌ద‌వి నుంచి బదిలీచేసి, అదనపు డీజీ (పర్సనల్)గా నియమించింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మళ్ళీ శివధ‌ర్ రెడ్డి నియమించారు. ఆగస్టు 2024లో డీజీపీగా పదోన్నతి పొందారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like