నీట మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్‌

MGBS bus stand submerged in water:తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో మూసీ నది మహోగ్రరూపం దాల్చడంతో నగరవాసులు వణికిపోతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. రాబోయే రెండు రోజులు మరింత ప్రమాదకరమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నీట మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్‌
మూసీ నది ఉధృతి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తారస్థాయికి చేరింది. 45 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా వరద ప్రవాహం పెరగడంతో జ‌నం ఇబ్బంది ప‌డ్డారు. ఈ వరద బీభత్సం కారణంగా ఎంజీబీఎస్ (మహాత్మాగాంధీ బస్‌స్టాండ్)లోకి నీరు చేరింది. ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు పూర్తిగా నీట మునిగాయి. ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగిన ఈ వరద తీవ్రతతో ప్రయాణికులు బస్టాండ్‌లోనే చిక్కుకుపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో లోపలే ఉండిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని ఆదేశించారు. మున్సిపల్ హైడ్రా డీఆర్ఎఫ్ (DRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని, ఒక్కొక్కరిని చేతులు పట్టుకొని బయటికి తీసుకువ‌చ్చాయి.

ఉస్మాన్ సాగర్ గేట్లను ఒక్క‌సారిగా ఎత్త‌డంతో ఈ వ‌ర‌ద ఉధృతి పెరిగిన‌ట్లు స‌మాచారం. నార్సింగి-మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) సర్వీస్ రోడ్డులో కూడా వరద ఉధృతి పెరగడంతో నలుగురు వ్యక్తులు ఆటో ట్రాలీలో చిక్కుకుపోయారు. మార్గంలో వెళ్లకూడదని బారికేడ్లు ఏర్పాటు చేసినా, డ్రైవర్ పట్టించుకోకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే స్పందించి, ఆ నలుగురిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. చిక్కుకుపోయిన ఆటో ట్రాలీకి తాడు కట్టి, డీఆర్ఎఫ్ వాహనంతో బయటికి లాగారు.

You might also like