రైతు ఇంటికి వెళ్లి లంచం తీసుకుంటుండగా…
ACB Arrest:లంచం డబ్బులు తీసుకోవడానికి ఏకంగా రైతు ఇంటికి వెళ్లాడో ప్రబుద్దుడు.. రైతుకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే లంచం డిమాండ్ చేయడంతో ఆ రైతు ఇంటికి పిలిచాడు. దీంతో ఎగేసుకుంటూ వెళ్లి మరీ ఏసీబీ వలలో పడ్డాడు కన్నెపల్లి ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బానోతు దుర్గాప్రసాద్.. రైతు గోమాస కిష్టయ్యను లంచం కోసం డిమాండ్ చేశాడు. ఆ రైతుకు పశువుల పాక మంజూరు కాగా దాంట్లో భాగంగా రూ. 10,000 డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు కిష్టయ్య టెక్నికల్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్‌ను ఇంటికి పిలిచాడు. కన్నెపల్లి మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీ రైతు నివాసంలో పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ మేరకు నిందితున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని అతన్ని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని కోరారు.