తాగి తన్నుకున్నరు..
మంచిర్యాల జిల్లా మందమర్రి పాల చెట్టు ఏరియాలో రోడ్డుపై యువకులు హల్చల్ సృష్టించారు. తాగిన మైకంలో కట్టెలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రెండు గ్రూప్లుగా మారి దాడులు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పాల చెట్టు ఏరియాలో మందమర్రి విద్యానగర్‌కు చెందిన కొందరు యువకులు ఆటోలో వచ్చారు. ఆటో యు టర్న్ చేసుకునే సందర్భంలో బైక్ మీద వెళ్తున్న పచ్చిక రవితేజ, బండ రాకేష్ అనే యువకులు ఆటోకు అడ్డు వచ్చారు. చిన్నపాటి విషయానికి అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఉన్న యువకులందరూ కలిసి ఇద్దరిపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో పచ్చిక రవితేజ తలకు గాయాలయ్యాయి. బాధితుడు పచ్చిక రవితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటోలో వచ్చి దాడి చేసిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న జిల్లపల్లి ఆకాష్, కోట మహేష్, రెండ్ల శ్రీకాంత్, దానబోయిన నవీన్ కుమార్, జిల్లపల్లి ఆకాష్ స్నేహితుడు (పేరు తెలియని వ్యక్తి)లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు జిల్లపల్లి ఆకాష్, అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు. మిగిలిన నిందితులు పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేర ప్రవృత్తి కొనసాగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడానికి వెనకాడబోమని శశిధర్ రెడ్డి హెచ్చరించారు.
ఇక ఇదే ఘటనలో గాయపడిన ఇద్దరు యువకుల్లో బండ రాకేష్, బొంతల మురళితో కలిసి వీరిని కొట్టిన కోట మహేష్ పై దాడి చేశారు. ఈ సంఘటన మీద కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.