వారం రోజుల పాటు వాన‌లే..

భారీ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌లం అయిన ప్ర‌జ‌ల‌కు మూడు రోజుల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అయితే, శ‌నివారం బంగాళ‌ఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డనుంది. దీని ప్ర‌భావంతో తెలంగాణ‌వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది.

ఈ ఏడాది రుతుప‌వ‌నాల వ‌ల్ల సాధార‌ణ వ‌ర్షాలే ప‌డినా… వ‌రుస అల్ప‌పీడ‌నాల‌తో తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో పాటు వరుస అల్ప పీడనాలు.. వీటన్నింటి ప్రభావంతో తెలంగాణలో ఇప్పటి వరకు కుండపోత వానలు కురిశాయి. జూన్, జులై నెలలో సాధారణ వర్షపాతం.. కొన్ని ప్రాంతాల్లో అంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యింది. కానీ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కుండపోత వానలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అక్టోబర్ నాటికి తెలంగాణలో వర్షాకాలం పూర్తి కావాలి. కానీ ఈ ఏడాది పరిస్థితి అలా లేదు.

శ‌నివారం బంగాళాఖాతంలో ఏర్ప‌డే అల్ప‌పీడ‌న ద్రోణితో వచ్చే వారం అంతా తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌-గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు.. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. శుక్ర‌వారం మరింత బలపడి.. శ‌నివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే వారం అంతా తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

You might also like