భద్రత కుదింపు.. నటరాజన్ పిలుపు..
హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) నివాసం వద్ద పోలీసులు భద్రత కుదించారు. మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు ఔట్ పోస్టును కూడా తొలగించేశారు. దీంతో కొండా సురేఖ మంత్రి పదవి తొలగిస్తారనే ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ దేవాదాయ శాఖలోని ఫైల్స్ అన్ని అప్పగించాలని అధికారులకు ఆదేశించడం కలకలం రేపుతోంది. ఇక మరోవైపు మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ పిలిచారు. మరికాసేపట్లో ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తో మంత్రి కొండా సురేఖ బేటీ కానున్నారు. ఇప్పటికే మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి కొండా సురేఖతో సుమంత్ సతీమణి మనీషా భేటీ అయ్యారు.
ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ పదవి ఉంటుందా..? ఊడుతుందా…? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సుమంత్ అనే మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా నిన్న రాత్రి ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించారంటూ ఫిర్యాదు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సుమంత్ ను స్వయంగా రక్షించి తనతో పాటు తీసుకెళ్లారు కొండా సురేఖ. ఆమె కుమార్తె సీఎంతో పాటు పలువురు తన తల్లిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత దాకా వచ్చిన తర్వాత వివాదం ఇంతటితో ఆగే అవకాశం కనిపించడం లేదు.
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తమపై కుట్ర చేస్తున్నారని ఓ మంత్రి ఆరోపించడం సంచలనం కలిగించింది. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా.. ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రి వర్గంలో ఉండలేరు . ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉందని పలువురు స్పష్టం చేస్తున్నారు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం లేదా ఆమెనే రాజీనామా చేయడం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటు ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో సీరియస్‌గా ఉండటం, మరోవైపు మీనాక్షి నటరాజన్ పిలిపించడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ రేగుతోంది.