మేనిఫెస్టో మరిచిన మంత్రి
-సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని...
-40 వేల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా
-మిషన్ భగీరథ కంటే మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ తీసుకువస్తామని...
-గోదావరికి కరకట్టల నిర్మించి రైతుల కన్నీళ్లు తుడుస్తామని...
-రెండు 100 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేలా..
-సింగరేణి కార్మికుల ఇన్‌కంటాక్స్ రీయింబర్స్మెంట్
-గోదావరి తీరంలో కరకట్టల నిర్మాణం
-ఎన్నో హామీలతో మేనిఫెస్టో ప్రకటించిన మంత్రి వివేక్
-అమలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
The minister forgot the manifesto:అద్భుతమైన హామీలు.. యువతకు ఉద్యోగాలు, కార్మికుల వరాలు, నియోజకవర్గ ప్రజలకు అభివృద్ది కోసం నిధులు… మైనింగ్ ఇన్‌స్టిట్యూషన్లు… స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు.. 100 పడకల ఆసుపత్రులు.. మినీ యూనివర్సిటీలు.. అగ్రికల్చర్ సెంటర్లు… ఇలా ఒకటా రెండా..? రాష్ట్ర మేనిఫెస్టోకు సమానంగా ఓ నియోజకవర్గ మేనిఫెస్టో… ఇదంతా చూసిన ప్రజలు.. బ్రహ్మాండం అనుకున్నారు… ఆయనకు ఓటేశారు.. ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు… కానీ, ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు… రెండేళ్లు అయ్యింది… ఉలుకూ లేదు… పలుకూ లేదు.. ఇచ్చిన హామీలు నెరవేరలేదు.. మేనిఫెస్టో అమలు కాలేదు… మరి ఇప్పటికైనా ఆ మేనిఫెస్టో దుమ్ముదులుపుతారా..? తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా…? అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
దాదాపు 40 వేల ఉద్యోగాల కల్పన… ఇక్కడే మైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు… 100 పడకల ఆసుపత్రులు రెండు.. సింగరేణి కార్మికులకు ఇన్‌కంటాక్స్ రీయెంబర్స్‌మెంట్.. సింగరేణి ప్రాంతాల్లో పట్టాల పంపిణీ.. నియోజకవర్గం అంతటికీ మిషన్ భగీరథ కంటే మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ.. గోదావరికి కరకట్టల నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు… వాస్తవానికి ఇవన్నీ ప్రజలకు అవసరం అయ్యేవే… రెండేళ్ల కిందట చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున నుంచి గడ్డం వివేక్(Gaddam Vivek) అభ్యర్థిగా నిలబడ్డప్పుడు ఇచ్చిన హామీలు… ఆయన ఏకంగా ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి మరీ ప్రజల వద్దకు వెళ్లారు. ఆయన ప్రకటించిన మేనిఫెస్టో నచ్చిన ప్రజలు ఆయనకు ఓటేశారు.. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది… కానీ….
ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు..
ఈ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత గడ్డం వివేక్ నియోజకవర్గ వర్గానికి సరిగ్గా రావడం లేదు. ఆయన అడపాదడపా వచ్చినా నామ మాత్రపు పర్యటనలు, సమీక్షలకు మాత్రమే పరిమితం అవుతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యే నుంచి మంత్రిగా అయ్యారు. దీంతో నియోజకవర్గ ప్రజలు మరింత సంతోషించారు. తమ నియోజకవర్గానికి మరిన్ని నిధులు వస్తాయని, వివేక్ ప్రకటించిన మేనిఫెస్టో సమర్థవంతంగా అమలు అవుతుందని ఆనందించారు. కానీ, దాదాపు రెండేళ్లు గడుస్తున్నా మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఏ మాత్రం అమలు కావడం లేదు… కనీసం వాటిని అమలు చేసేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివేక్ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలేవీ కూడా కార్యరూపం దాల్చలేదని వారు దుయ్యబడుతున్నారు.
40 వేల ఉద్యోగాలేవీ సారూ..?
సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ అనుబంధ పరిశ్రమల స్థాపన ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు వివేక్.. మరి ఆ పరిశ్రమల స్థాపన ఎప్పుడు జరుగుతుంది..? తమకు ఉద్యోగాలు ఎప్పుడ వస్తాయని ప్రశ్నిస్తున్నారు యువకులు.. ఇక చెన్నూర్లో మైనింగ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా కలగానే మిగిలింది.. మందమర్రి, జైపూర్, చెన్నూర్లో మూడు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, సిరామిక్ టైల్స్ ఇండస్ట్రీ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వాటికి కూడా అతీగతీ లేకుండా పోయింది. చెన్నూర్లో అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, కొత్త వంగడాల అభివృద్ధి కోసం అగ్రి రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని వాటి గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో భూనిర్వాసితులు, స్థానిక యువతకీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. దీంతో తమకు న్యాయం జరుగుతుందని యువత ఎదురుచూసినా వారి కండ్లు కాయలు కాస్తున్నాయని తప్ప హామీలు అమలుకు నోచుకోవడం లేదు.
సింగరేణి.. పట్టించుకోరేంది..?
ఇక, సింగరేణి కార్మికులకు సైతం ఎన్నో హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్‌కంటాక్స్ గురించి కూడా వివేక్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. వాటి గురించి కూడా కనీసం చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక క్షేత్రాల్లో వివేక్, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని వాటి గురించి కనీసం ప్రస్తావించడం లేదని దుయ్యబడుతున్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు రూ.15 లక్షల వడ్డీ లేని లోన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని, మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాలో 100 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి నుంచి మెడికల్ రెఫరల్ కేసులు నేరుగా హైదరాబాద్ వెళ్లడానికి చర్యలు తీసుకుంటానని సైతం ప్రకటించారు. ఇక ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న కార్మికుల ఇన్‌కంటాక్స్ సింగరేణి నుంచి రీయింబర్స్మెంట్ అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చినా అది కూడా పట్టించుకోవడం లేదు. సింగరేణి జాగాల్లో నివాసం ఉంటున్న వారికి పూర్తిస్థాయిలో పట్టాల పంపిణీ.. ఖాళీ క్వార్టర్లను రిటైర్డ్ కార్మికులకు కేటాయిస్తామని చెప్పిన హామీలు నీటిముటలయ్యాయి.
కరకట్టల నిర్మాణాలు కలేనా…?
ఇక మౌలిక వసతులు సైతం కల్పించి ప్రజల కష్టాలు, కన్నీరు తుడుస్తానని వివేక్ ఇచ్చిన హామీలు కనీసం కార్యరూపం దాల్చడం పక్కనుంచి వాటి గురించి ఎలాంటి ప్రస్తావన సైతం తీసుకురావడం లేదు.
నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు, అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ కంటే మెరుగైన తాగునీటి సరఫరా పథకాలు తీసుకువస్తామని ఘనంగా ప్రకటించి వాటిని నీళ్లలో కలిపేశారు. అన్ని గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంతో నియోజకవర్గ కేంద్రంతో అనుసంధానం చెప్పినా వాటిని కనీసం పట్టించుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు సమస్యకు పరిష్కారం చూపిస్తానని గోదావరికి కరకట్టల నిర్మాణం చేపడతామని చెప్పినా అది కలగానే మిగిలింది..
ప్రజలకు కష్టాలు.. కన్నీళ్లే…
వివేక్ గెలిచిన తర్వాత మంత్రి కావడంతో తమ కష్టాలు అన్ని తీరుతాయని, కన్నీళ్లు ఉండవని భావించిన ప్రజలకు అవి అలాగే కొనసాగుతున్నాయి. గతంలో కాళేశ్వరం ముంపు వల్ల పంటలు నష్టపోయిన రైతులు ఈ ఏడాది కూడా అలాగే తమ పంటను నష్టపోవాల్సి వచ్చింది. మరి వివేక్ ఇచ్చిన కరకట్టల నిర్మాణం హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు రైతులు.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు మంచిర్యాల పట్టణం మునిగిపోకుండా ఉండేందుకు కరకట్టల నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చి దానికి సంబంధించి కొన్ని నిధులు సైతం తీసుకువచ్చారని మంత్రిగా ఉండి మీరు ఏం చేయకపోతే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వివేక్ మంత్రి అయిన తర్వాత తమ నియోజకవర్గానికి అధికంగా నిధులు వస్తాయని భావించామని కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయ్యిందని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇలా వేలాదిగా ఉద్యోగాలు… కోట్లల్లో నిధులు… మౌలిక సదుపాయాల కల్పన.. ఎన్నోన్నే వాగ్ధానాలు చేసిన మంత్రి వివేక్ తన పలుకుబడిని ఉపయోగించి చెన్నూరు నియోజకవర్గానికి నిధులు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని వివేక్‌కు ఓటేసామని కానీ ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి వివేక్ తన మేనిఫెస్టో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.