వణికిస్తున్న వరద
Cyclone Montha:చారిత్రక ఓరుగల్లు వరద ఇంకా వీడటం లేదు. వర్షం కాస్తా తెరపినిచ్చినప్పటికీ నగరాన్ని ఇంకా వరద మాత్రం వదలడం లేదు. ఈ నగరంపై మొంథా తుఫాను (Cyclone Montha) విరుచుకుపడింది. బుధవారం రోజంతా కుండపోతగా వర్షం కురియడంతో జలదిగ్బంధం అయింది. వర్షం కాస్తా తెరపినిచ్చింది. అయినా వరద తగ్గకపోవడంతో జనం నానా అవస్థలు పడుతునన్నారు. మొత్తం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తింది. నగరం పరిధిలోని 30 కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. వరంగల్- హనుమకొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హంటర్‌రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్: ములుగు వెళ్లే రోడ్డులో సైతం నాలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు కాలనీల్లో వర్షపునీరు ఇళ్లల్లోకి చేరింది. సాయిగణేశ్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్ ఎన్ఎన్నగర్, మైసయ్యనగర్, సమ్మయ్యనగర్‌లో ఇళ్లలోకి చేరిన వరద నీరు చేరింది.
ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ తూర్పులో ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. ముంపుప్రాంతాల వాసులను పడవల సహాయంతో తరలించారు. నగరంలోని 12 పునరావాస కేంద్రాలకు 1200 మంది బాధితులను తరలించారు. హనుమకొండలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తున్నది. వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
వర్షాల దృష్ట్యా వరంగల్ బల్దియా కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1980 ఏర్పాటు చేశారు. డీఆర్ఎఫ్, ఇంజినీరింగ్, శానిటరీ సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను నియమించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో ఎస్ఏ-1 పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు వరంగల్ డీఈవో వెల్లడించారు.