మావోయిస్టు మాస్ట‌ర్‌మైండ్ హిడ్మా హ‌తం

Hidma Encounter: మూడు రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హిడ్మా అలియాస్‌ చైతు ఎన్‌కౌంటర్‌లో హతమ‌య్యాడు. ఏపీ, తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్‌లో పోలీసుల చేతికి హిడ్మా చిక్కిన‌ట్లు తెలుస్తోంది. ఉద‌యం ఆరు గంట‌ల నుంచి ఏడు గంట‌ల మ‌ధ్య‌లో కాల్పులు జ‌రిగాయి. అల్లూరి జిల్లా రంప‌చోడ‌వరం వ‌ద్ద జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో హిడ్మా, ఆయ‌న భార్య‌తో పాటు న‌లుగురు మావోయిస్టులు మృతి చెందారు.

గ‌తంలో ఎన్నో వార్త‌లు..
ఇదిలావుండగా, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చినపోయాడంటూ గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. ఎన్ కౌంటర్‌లో చనిపోయాడంటూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ హిడ్మా పోలీసులకే సవాల్ విసురుతూ వచ్చాడు. 2023లో హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ప్ర‌క‌టించారు. తాను చ‌నిపోలేద‌ని బ‌తికే ఉన్నాన‌ని ఏకంగా హిడ్మానే ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఎన్నో ఎన్‌కౌంట‌ర్ల‌ల నుంచి త‌ప్పించుకున్నారు. దాదాపు ప‌ది ఎన్‌కౌంట‌ర్ల నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. దండ‌కార‌ణ్యంలో అణువ‌ణువూ తెలిసి ఉన్న ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు పోలీసుల కండ్లు క‌ప్పి బ‌య‌ట‌ప‌డేవాడు.

ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకుని…
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లా మిర్తుర్‌కు చెందిన హిడ్మా (40).. కేవలం 7వ తరగతి వరకూ మాత్రమే చదివాడు. ఇతడు 17 ఏళ్ల వయసులో 1996లో మావోయిస్టు పార్టీలో చేరాడు. క్రమంగా ఎదుగుతూ చివరకు మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో పనిచేశాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలోనూ పని చేశాడు. అనేక ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించి అనేక మంది పోలీసులు హతమవ్వడానికి ప్రధాన కారణమయ్యాడు. 2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసుల దుర్మరణానికి కారణమయ్యాడు. దీంతో అప్పటి నుంచి ఇతడి కోసం పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. ఇలా మొత్తం మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాలకు కొరకరాని కొయ్యగా మారాడు. ఇతడిపై కోటి రూపాయ‌ల‌కు పైగా రివార్డు కూడా ఉంది.

కేంద్ర క‌మిటీ స‌భ్యుల్లో అత్యంత పిన్న వ‌య‌స్కుడు…
కేంద్ర క‌మిటీ స‌భ్యుల్లో హిడ్మానే చాలా చిన్న వ‌య‌స్సు ఉన్న‌వాడు. మావోయిస్టులు పాల్పడిన అనేక విధ్వంసాల్లో హిడ్మానే ప్రధాన భూమిక పోషించారు. హిడ్మా ద‌ళానికి మావోయిస్టుల్లో అత్యంత శ‌క్తివంత‌మైన ద‌ళంగా పేరుంది. గెరిల్లా దాడుల వ్యూహ‌క‌ర్త‌గా ఆయ‌న ఎన్నో దాడుల్లో ముందుండి పాల్గోన్నారు. ఆయ‌న‌కు హిందీ, గోండు, బెంగాల్, తెలుగు త‌దిత‌ర భాషల్లో ప‌ట్టుంది. వ‌రుస లొంగుబాట్ల నేప‌థ్యంలో హిడ్మానే ముందుండి పార్టీని న‌డిపిస్తార‌ని అంతా భావించారు. కానీ, ఆయ‌న ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెంద‌డంతో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ త‌గిలిన‌ట్ల‌య్యింది.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like