బంగారు సింగరేణి

-బంగారం అన్వేషణకు తొలి అడుగు
-కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీతో ఒప్పందం

కర్ణాటకలోని రాయచూర్, యాదగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్న దేవదుర్గ బ్లాక్‌లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు సింగరేణి సంస్థ కీలక ముందడుగు వేసింది. అన్వేషణ పనులు ప్రారంభించేందుకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది.

బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక డీఎంజీ డైరెక్టర్ రంగప్ప, సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సింగరేణికి లైసెన్స్ లభించిన దేవదుర్గ ప్రాంతంలోని 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదేళ్లలో అన్వేషణ పూర్తి చేయాలని ఒప్పందం కుదిరింది.

ఇప్పటికే అధికారులను నియమించామని, త్వరలో మరింత మంది అధికారులు, సిబ్బందిని నియమించి రెండేళ్లలోపు G4 స్థాయి అన్వేషణను పూర్తి చేస్తామని డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు తెలిపారు. ఇతర రాష్ట్రంలో ఈ స్థాయిలో ఖనిజ అన్వేషణ చేపట్టడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

అన్వేషణలో భాగంగా రిమోట్ సెన్సింగ్, జియోలాజికల్ మ్యాపింగ్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్కౌట్ డ్రిల్లింగ్ చేపట్టి, సేకరించిన నమూనాలపై పెట్రోగ్రాఫిక్, మినరలాజికల్ అధ్యయనాలు నిర్వహిస్తారు. నమూనాల సమగ్ర మూలకాల విశ్లేషణను కొత్తగూడెంలోని సింగరేణి జియోసైన్స్ ల్యాబొరేటరీలో చేపట్టనున్నారు.

అనంతరం సమగ్ర నివేదికను కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సమర్పించి, నివేదిక ఆధారంగా తదుపరి దశలో మరింత విస్తృత స్థాయి అన్వేషణ చేపట్టే అవకాశం ఉంది. కార్యక్రమంలో ఎక్స్‌ప్లోరేషన్ జీఎం పంకజ్ కులశ్రేష్ఠ, డీజీఎం (జియాలజీ) వి. రాజేశ్వర్, డీవైఎఫ్‌ఎం లక్ష్మీప్రియ, సీనియర్ లా ఆఫీసర్ ప్రభందిత తదితరులు పాల్గొన్నారు.

You might also like