అదే ప్రాంతం… తీవ్ర నష్టం…
Maoist Party:ఒకప్పుడు అది మావోయిస్టులకు కంచుకోట… వారికి షెల్టర్‌జోన్.. అక్కడకు వెళ్లాలంటేనే భద్రతా దళాలకు సవాల్.. కానీ, ఇప్పుడు వారు యథేచ్ఛగా వెళ్తున్నారు. మావోయిస్టులను మట్టుబెడుతున్నారు… కేవలం ఐదు నెలల కాలంలోనే రెండు ఎన్కౌంటర్లలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులతో సహా ముఖ్యమైన మావోయిస్టు నేతలను ఎన్కౌంటర్ చేశారు.
త్రీ జంక్షన్… మూడు రాష్ట్రాలకు కేంద్ర బిందువు… ఎక్కడి నుంచి ఎటైనా వెల్లొచ్చు.. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మావోయిస్టులకు ప్రధాన స్థావరం.. దండకారణ్యం తర్వాత అంతటి సేఫ్ ప్లేస్‌గా మావోయిస్టులు భావిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం అటవీ ప్రాంతం మావోయిస్టులకు చాలా రక్షణాత్మక ప్రాంతం. ఎక్కడ ఏం జరిగినా మిగతా రెండు రాష్ట్రాల్లోకి వెళ్లిపోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ సమావేశాలు కొనసాగిస్తుంటారు. అయితే, ఆపరేషన్ కగార్ ప్రారంభం తర్వాత భద్రతా దళాలు, పోలీసులు అన్ని చోట్లకు యథేచ్ఛగా వెళ్తున్నారు. ఎన్కౌంటర్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా డ్రోన్లు, ఇతర ఆధునిక సాంకేతికత సాయంతో వారు మావోయిస్టుల స్థావరాలకు చొచ్చుకుపోతున్నారు.
ఇదే ఏడాది జూన్ 18న ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, AOB స్పెషల్ జోనల్ మెంబర్ గాజర్ల రవి(Maoist Central Committee member Gazerla Ravi) అలియాస్ ఉదయ్, మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు ఉన్నారు. తాజాగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Maoist leader Hidma) అతని భార్య మరో నలుగురు మృత్యవాత పడ్డారు. మంగళవారం ఉదయం 6-7 గంటల ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త వెల్లడించారు.
ఇలా ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటల్లా ఉన్న ప్రాంతాలను సైతం భద్రతా బలగాలు గుర్తించడం అక్కడి వరకు వెళ్లి ఎన్కౌంటర్లు చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మావోయిస్టులు ముందుకు సాగుతున్నారు. అయితే, ఇక్కడకు మావోయిస్టులు ఎందుకు వచ్చారు..? ఏదైనా సమావేశం కోసం వచ్చారా..? లేక చత్తీస్ఘడ్, ఒడిషా ప్రాంతాల్లో నిర్బంధం పెరిగిపోవడంతో ఇక్కడ తలదాచుకునేందుకు వచ్చారా..? అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటన నుంచి మరికొంత మంది సైతం తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం కూడా పోలసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.