వాళ్ల గృహప్రవేశం సరే… మీదెప్పుడు..?
-ఇందిరమ్మ ప్రోసీడింగ్స్ ఇస్తున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్
-మరి మీ గృహప్రవేశం ఎప్పుడని ప్రశ్నిస్తున్న ప్రజలు
-ఎన్నికలప్పుడు ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని హామీ
-సమయం మించిపోతున్నా ఇల్లు కట్టుకునే సూచనలు లేవు
దీపావళి సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల వద్దకు వెళ్లి నూతన గృహాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరిన వేళ వారితో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు… ఇక్కడి వరకు బాగానే ఉంది… పేదలకు ఇండ్లు వచ్చినయ్… వారి కల నెరవేరింది… కానీ, ఎమ్మెల్యేకు మాత్రం సొంత ఇల్లు లేకుండా పోయింది… ఆయన ఇచ్చిన హామీ అమలు కాకుండా పోయింది.. ఎన్నికల ముందు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్పిన మాటలు హుష్ కాకి అయిపోయాయి…
ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇచ్చిన హామీలను విస్మరించి, నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న స్థానిక ఎమ్మెల్యే తీరుపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో ప్రజలు పట్టం కట్టగా.. ఆయన మాత్రం నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి.
నిలవని మాట.. పటాపంచలైన హామీలు
ఎన్నికల ప్రచార సమయంలో తాను స్థానికంగానే ఇల్లు కట్టుకుని నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటానని ఎమ్మెల్యే బాండ్ పేపర్ రాసిచ్చారు. అంతేకాకుండా, కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయాన్ని చెప్పించి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. ప్రతిపక్షాలు ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారని చేసిన ప్రచారాన్ని నమ్మకుండా, ప్రజలు ఆయన మాటలనే నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు. కాని గెలుపు తర్వాత పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తో, లేక ఇతర కారణాలో తెలియదు కానీ, ఆయన బెల్లంపల్లికి చుట్టపుచూపుగా మారాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు చెప్పినట్టుగానే ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్‌లో కీలక అభివృద్ధి పనులు
నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పాలిటెక్నిక్ కళాశాల అప్‌గ్రేడేషన్ పెండింగ్‌లోనే ఉంది. కొత్త బస్ డిపో ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కూడా కరవయ్యాయి. పట్టణంలో రోడ్లు అధ్వాన్నంగా మారి ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యువతకు ఉపాధి కల్పిస్తుందన్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. బుగ్గ రాజేశ్వరస్వామి క్షేత్రాన్ని ప్రాంతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న హామీ కూడా ఆచరణకు నోచుకోలేదు.
అంతులేని అనుచరుల హల్చల్
ఇక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి మండలానికి ఒకరిద్దరు అనధికారిక ‘ఎమ్మెల్యేలు’ తయారయ్యారు. ప్రజల పనులు జరగాలంటే వారి చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. నియోజకవర్గంలో కొందరి తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అయినా నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
ప్రోసీడింగ్స్ ఎవరూ ఇవ్వడం లేదా..?
ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్ అందచేసిన ఎమ్మెల్యే వినోద్‌కు బెల్లంపల్లిలో సొంత ఇల్లు కట్టుకునేందుకు ఎవరూ ఇవ్వడం లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల్లో ఒక మాట చెప్పి, ఆ మాట తప్పి తమను ఇంత మోసం చేస్తారా..? అని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. గెలిపించిన ప్రజల బాగోగులను పట్టించుకోకుండా, అడపాదడపా వచ్చి వెళ్తుండటంతో నియోజకవర్గం అనాథలా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే ఇల్లు కట్టుకుంటారా..? ఆ ఏముంది లే… ఇంకో రెండేళ్లు ఇలా గడిపేస్తే అయిపోతుంది లే అనుకుంటారా..? చూడాలి మరి.. ఒకవేళ రెండోదే జరిగితే.. ఆయన తనకున్న డబ్బు బలంతో వేరే నియోజకవర్గంలో పోటీ చేయవచ్చు.. కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయరనే మచ్చ మిగిలిపోతుంది.. స్థానిక కాంగ్రెస్ నాయకులను సైతం ప్రజలు నమ్మని పరిస్థితి నెలకుంటుంది.. మరి నష్ట నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయో..? చూడాలి మరి…